Women consent age issue : మహిళల శృంగార సమ్మతి వయసుకు సంబంధించి మధ్యప్రదేశ్ హైకోర్టులోని గ్వాలియర్ బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా మహిళల శృంగార సమ్మతి వయసును 18 నుంచి 16 సంవత్సరాలకు తగ్గించే దిశగా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ప్రస్తుతం మహిళ సెక్స్ అంగీకార వయసు 18 ఏళ్లుగా ఉంది. దీని వల్ల క్రిమినల్ కేసుల్లో.. కౌమార దశలో ఉన్న బాలురకు తీవ్రంగా అన్యాయం జరుగుతోందని మధ్యప్రదేశ్.. గ్వాలియర్ బెంచ్ అభిప్రాయపడింది.
Women consent age legal Problems : 2020లో ఒక అబ్బాయి.. మైనర్ బాలికపై పలుసార్లు అత్యాచారం చేసినట్లు.. దీంతో ఆ బాలిక గర్భవతి అయినట్లు ఎఫ్ఐఆర్ నమోదైంది. దీని పూర్వాపరాలు పరిశీలించిన మధ్యప్రదేశ్ హైకోర్టులోని గ్వాలియర్ బెంచ్.. జూన్ 27న కేంద్రానికి లేఖ రాసింది. చట్టపరంగా బాలికల సెక్స్ సమ్మతి వయసు 18 ఏళ్లుగా ఉండడం వల్ల.. అన్యాయంగా కౌమార దశలో ఉన్న యువకులపై క్రిమినల్ కేసులు నమోదవుతున్నాయని గ్వాలియర్ బెంచ్ అభిప్రాయపడింది.
సెక్సువల్ అవేర్నెస్ పెరిగింది!
"ఈ రోజుల్లో నెట్వర్క్ కనెక్టివిటీ, సోషల్ మీడియా ప్రభావం బాలబాలికల మీద చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ప్రస్తుత కాలంలో 14 ఏళ్లకే అమ్మాయిలు రజస్వల అవుతున్నారు. అందువల్ల చిరుప్రాయంలోనే పరస్పర ఆకర్షణతో అబ్బాయిలు, అమ్మాయిలు శారీరకంగా దగ్గర అవుతున్నారు. మహిళల శృంగార సమ్మతి వయసు 18 ఏళ్ల నుంచి 16 ఏళ్లకు తగ్గించే దిశగా కేంద్రం ఆలోచించాలి. ఈ చట్టం వల్ల క్రిమినల్ కేసుల్లో చాలా మంది అబ్బాయిలకు అన్యాయం జరుగుతోంది.' అని గ్వాలియర్ బెంచ్అభిప్రాయపడింది.
ఏమి చేయాలో వాళ్లకు తెలుసు!
'2020లో ఒక అబ్బాయి.. మైనర్‌పై పలుమార్లు అత్యాచారం చేసినట్లు ఎఫ్ఐఆర్ నమోదైంది. బాధితురాలు 2020లో కోచింగ్ కోసం ఓ వ్యక్తి వద్దకు వెళ్లింది. అతను ఆమెకు మత్తు పానీయం ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ దారుణాన్ని వీడియో కూడా తీశాడు. తరువాత ఆ వీడియో చూపించి.. ఆమెను బెదిరించి పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టాడు. ఇది ఇలా ఉండగా.. కొంత కాలం తరువాత ఆ బాలిక తన దూరపు బంధువు ఒకరితో శారీరక సంబంధం పెట్టుకుంది. ఈ కేసును పరిశీలిస్తే.. చిన్న వయస్సులోనే బాల, బాలికలకు శారీరక, మానసిక స్థితిగతులు చాలా మెచ్యూర్‌గా ఉంటున్నాయి. తాము ఎవరితో శారీరక సంబంధాలు పెట్టుకోవచ్చో? లేదో? నిర్ణయించుకోగలుగుతున్నారు' అని గ్వాలియర్ బెంచ్ అభిప్రాయపడింది. అందువల్ల ఇలాంటి అత్యాచార కేసుల్లో మగ పిల్లలందరినీ నేరస్థులుగా భావించలేమని స్పష్టం చేసింది.