కర్ణాటక మాజీమంత్రి రమేశ్ జార్ఖిహోళి సీడీ వ్యవహారం.. తాజాగా మరో మలుపు తిరిగింది. దర్యాప్తును దగ్గరుండి పర్యవేక్షించాలని కోరుతూ.. కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఓ అనధికారిక లేఖ వెళ్లింది. ఆ లేఖలోని అంశాల బట్టి.. వీడియోలో ఉన్నట్లు భావిస్తున్న మహిళ రాసినట్టుగా స్పష్టమవుతోంది.
తనకు ప్రమాదం పొంచి ఉందన్న విషయాన్ని కోర్టు గుర్తించి.. తనకు రాష్ట్ర ప్రభుత్వం రక్షణ కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని ఆ మూడు పేజీల లేఖలో ఆ మహిళ పేర్కొంది. తనకు న్యాయం జరిగేలా చూడాలని కోరింది.
జార్ఖిహోళి, ప్రభుత్వం.. చెప్పినట్టుగా సిట్ బృందం వ్యవహరిస్తోందని, అందువల్ల దర్యాప్తు సంస్థపై తనకు నమ్మకం పోయిందని లేఖలో మహిళ వివరించింది.
"జార్ఖిహోళి పెద్ద పేరు ఉన్న వ్యక్తి. ఆయన నన్ను బహిరంగంగానే బెదిరించారు. తనపై ఉన్న ఆరోపణలను తొలగించుకునేందుకు ఎంతదూరమైనా వెళతానని ఆయన అన్నారు. నాకు, నా కుటుంబసభ్యులకు జార్ఖిహోళి నుంచి ప్రమాదం పొంచి ఉందని ఇప్పటికే చెప్పాను. అందుకే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని.. నాకు రక్షణ కల్పించాలని కోరాను. కానీ జార్ఖిహోళి సిట్‌ను ప్రభావితం చేసినట్టు తెలిసింది. ఆయన నన్ను ఎక్కడైనా చంపవచ్చు. ఆయనకున్న బలంతో ఆధారాలనూ తారుమారు చేయవచ్చు."