కర్ణాటక రాజధాని బెంగళూరుకు సిలికాన్ వ్యాలీ అనే పేరుంది. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఇదీ ఒకటి. దీని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆకాశాన్ని తాకే అపార్ట్మెంట్లు ఔరా అనిపిస్తుంటాయి. అయితే ఇందంతా నాణేనికి ఒకవైపే. అభివృద్ధి పేరుతో ఇక్కడ పర్యావరణం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు. సర్జాపుర్ సమీపంలోని హదోసిద్ధపుర సరస్సే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ.
మురుగు నీరు భారీగా చేరి ఈ సరస్సు కలుషితమైంది. దీంతో పరిష్కారం కోసం భూమి నెట్వర్క్ కాలేజ్ హెడ్ సీత.. 'జల సంరక్షకుడు' ఆనంద్ మల్లిగవాడను సంప్రదించారు. ఈ సరస్సును శుద్ధి చేసేందుకు దేశంలోనే తొలిసారి ఓ వినూత్న పద్ధతిని ఈయన ఉపయోగించారు.
వ్యర్థాల శుద్ధి కర్మాగారం కోసం రూ.కోట్లు ఖర్చు చేయకుండా, సిమెంటు ఎక్కువగా ఉపయోగించకుండా సహజసిద్ధమైన పద్ధతిలో సరస్సును శుద్ధి చేశారు ఆనంద్. దీనికోసం జీవసంబంధ మురుగునీటి శుద్ధి విధానాన్ని అవలంబించారు.
హదోసిద్ధపుర సరస్సు విస్తీర్ణం 35 ఎకరాలు. ఇందులో నీటిని పూర్తిగా ఖాళీ చేసి, బురద తొలగించి, సరస్సు మధ్య మట్టిలో ప్రత్యేక గోడ నిర్మించారు ఆనంద్. రూ.46 లక్షలతో వర్షపు నీరు, డ్రైనేజీ లైన్లను పూల్ ద్వారా వేరు చేశారు. కర్రలు, చెట్లు, మట్టి, ఇసుక, గుళకరాళ్లు ఉపయోగించి సరస్సు నీటిని శుద్ధి చేశారు. 2020 లాక్డౌన్లో ఫిబ్రవరి నుంచి జూన్ వరకు శ్రమించి సరస్సును అభివృద్ధి చేశారు. మరో 10ఏళ్ల వరకు ఇది కలుషితం కాదు. నదిలో ప్రవహించే నీరు లాగే ఈ సరస్సులోని నీరు కూడా శుభ్రంగా ఉంటుంది.