కరోనా తొలి దశ వ్యాప్తి నుంచి ప్రజలు ఇంకా తేరుకోకముందే.. దేశాన్ని రెండో వేవ్ వణికిస్తోంది. తొలి దశకు మించిన విధ్వంసాన్ని సృష్టిస్తోంది. రెండో దశ కరోనా వ్యాప్తి మరింత ప్రమాదకరంగా ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ విషయం రోజువారీ కేసులు, మరణాల్లో స్పష్టమవుతోంది. ప్రస్తుతం మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి ఎంత తీవ్రంగా ఉందో.. ఉత్తర్‌ప్రదేశ్‌లోనూ పరిస్థితి అంతే ప్రమాదకరంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఎవరి ఆక్సిజన్ వారే..
కరోనా కట్టడిలో సమర్థంగా పనిచేశామని గతేడాది చెప్పుకున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.. ఇప్పుడు నిస్సహాయంగా కనిపిస్తున్నారు. ఆస్పత్రులలో ఆక్సిజన్ కొరత ఏర్పడింది. పడకలు, వెంటిలేటర్లు, ఔషధాలు అందుబాటులో లేకుండా పోతున్నాయి. కరోనా రోగులకు ఆక్సిజన్ అందించడమే యూపీ సర్కార్ ముందు అతిపెద్ద సవాల్‌గా మారింది. ప్రజలు తమకు తాముగా ఆక్సిజన్ సిలిండర్లను వెంటతెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. ఇదే అదనుగా భావించిన అక్రమాసురులు.. బ్లాక్ మార్కెట్ దందాకు తెరతీశారు. బహిరంగంగా ఆక్సిజన్ అందుబాటులో లేకపోవడం వల్ల.. ప్రజలు తప్పనిసరై.. బ్లాక్ మార్కెట్ నుంచే అధిక ధరకు కొంటున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకంటే అధికంగా విక్రయిస్తున్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటం వల్ల.. యూపీ వైద్య వ్యవస్థపై ఊహించని ఒత్తిడి నెలకొంది. అన్ని ఆస్పత్రుల్లో రోగుల సంఖ్య సామర్థ్యానికి మించిపోయింది. కొత్త రోగుల కోసం పడకలుఅందుబాటులో లేవు. అప్పటికే అడ్మిట్ అయిన రోగులు.. సరైన వసతులు లేక నరకం అనుభవిస్తున్నారు. రాష్ట్ర రాజధాని అయిన లఖ్‌నవూలోనూ ఇదే పరిస్థితి. ప్రజలతో పాటు ప్రభుత్వ నిర్లక్ష్యం కూడా కేసుల పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది.
ఇదీ చదవండి:ఆక్సిజన్ లీకేజీతో 22 మంది మృతి- ప్రధాని సంతాపం
ఇదీ చదవండి:'నోట్లరద్దులాగే.. వ్యాక్సినేషన్లోనూ కేంద్రం విఫలం'
తరిగిపోతున్న నిల్వలు..
రాష్ట్ర యంత్రాంగం మొత్తం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో నిమగ్నమైంది. ప్రభుత్వం దగ్గరుండి కరోనా కట్టడికి కృషి చేయాల్సిన సమయంలో.. పక్క రాష్ట్రాల ఎన్నికలకు ప్రాధాన్యం ఇవ్వడంపై స్థానికంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. యూపీ రాజధానిలో పరిస్థితి అత్యంత తీవ్రంగా ఉంది. లఖ్‌నవూలోని అనేక ఆస్పత్రుల్లో ఆక్సిజన్ నిల్వలు క్రమంగా తగ్గిపోతున్నాయి. హోం ఐసోలేషన్‌లో ఉన్న రోగుల పరిస్థితి ప్రమాదకరంగా మారుతోంది. ఆస్పత్రిలో అడ్మిట్ అవ్వాలనుకున్నా.. బెడ్స్ లేకపోవడం సమస్యగా మారింది. నగరంలోని ఆక్సిజన్ ప్లాంట్‌లో ఇదివరకు రోజుకు 4,500 సిలిండర్లను నింపుతుండగా.. ఇప్పుడా సామర్థ్యాన్ని 5,500కు పెంచారు.