దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ పడగ విప్పుతున్నట్లు కనిపిస్తోంది. రోజువారీ కేసుల సంఖ్య గత కొద్ది రోజులుగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. దాదాపు పదకొండు నెలల క్రితం విధించిన లాక్‌డౌన్ పరిస్థితులు మళ్లీ వస్తాయేమోనన్న భయాలు వెంటాడుతున్నాయి.
సెప్టెంబర్ నెల మధ్యలో రోజుకు సగటున 90 వేలకు పైగా కేసులు వెలుగులోకి వచ్చాయి. అనంతరం కరోనా గ్రాఫ్ తగ్గుతూ వచ్చింది. ఫిబ్రవరి 1న అత్యంత తక్కువగా.. 8,635 కరోనా కేసులు నమోదయ్యాయి. ఎనిమిది నెలల్లో అదే అత్యల్పం. కానీ, ఇటీవల కేసుల సంఖ్య నిలకడగా పెరుగుతోంది. ప్రతిరోజు సగటున 12-16 వేల కేసులు వెలుగులోకి వస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో పరిస్థితి ఆందోళకరంగా మారుతోంది. మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, మధ్యప్రదేశ్, తమిళనాడు, గుజరాత్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో సగటు కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షల వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి.
ఇదీ చదవండి:కేసుల పెరుగుదలపై అప్రమత్తం..'మహా'లో ఆంక్షలు
ఈ రాష్ట్రాల్లో ఆంక్షలు..
మహారాష్ట్రలోని పుణెలో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సోమవారం నుంచి ఈ నిర్ణయాన్ని అమలులోకి తీసుకొచ్చింది. ఈ నెల 28 వరకు పాఠశాలలు, కళాశాలలు మూసివేయాలని ఆదేశించింది. అమరావతి జిల్లాలో వారంరోజుల పాటు పూర్తి లాక్‌డౌన్ విధించింది. మార్చి 1 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. రాజకీయ, మతపరమైన ర్యాలీలతో పాటు.. ప్రజలు గుమికూడే కార్యక్రమాలపైనా నిషేధం అమలవుతోంది. కొవిడ్ నిబంధనలు పాటించకుంటే లాక్‌డౌన్ పొడగించే అవకాశాలు కూడా ఉన్నాయని హెచ్చరించింది.
ఇదీ చదవండి:కర్ఫ్యూతో ఎడారిని తలపిస్తున్న అమరావతి
మరోవైపు, పలు రాష్ట్రాల్లో కేసుల పెరుగుదల నేపథ్యంలో బంగాల్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, తెలంగాణ నుంచి విమానాల్లో వచ్చే ప్రయాణికులకు కరోనా నెగెటివ్ రిపోర్టును తప్పనిసరి చేసింది. ఇందుకు సంబంధించి అన్ని విమానయాన సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది.
దిల్లీ సర్కార్ సైతం ఇదే తరహా నిర్ణయం తీసుకుంది. విమానాలు, రైళ్లు, బస్సుల్లో వచ్చేవారికి ఈ నిబంధన వర్తించనుంది. కారుల్లో వచ్చేవారికి దీని నుంచి మినహాయింపు ఉంటుంది. కరోనా నెగెటివ్ రిపోర్టు చూపించనివారికి అక్కడే పరీక్షలు నిర్వహించి... పాజిటివ్‌గా తేలితే 14 రోజుల పాటు క్వారెంటైన్‌కు పంపిస్తారు.
పెళ్లి మండపాల్లో కరోనా వ్యాప్తి నివారించేందుకు కర్ణాటక ప్రభుత్వం ఆంక్షలు అమలు చేస్తోంది. మండపాల్లో మార్షల్స్‌ను ఏర్పాటు చేసింది. ప్రజలు కొవిడ్ మార్గదర్శకాలు పాటించేలా చూసేందుకే ఈ నిర్ణయం తీసుకుంది.
అధిక కేసులకు కారణం?