తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ధరణి పుత్రుడు' ములాయం మృతి పట్ల ప్రముఖుల సంతాపం- మోదీ భావోద్వేగం! - mulayam singh yadav death modi

రాజకీయ కురువృద్ధుడు ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన జీవితం మొత్తాన్ని ప్రజాసేవకే అంకితమిచ్చారని కొనియాడారు. ఎమర్జెన్సీ సమయంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు ములాయం ఓ సైనికుడిలా పని చేశారని గుర్తు చేసుకున్నారు.

several-political-leaders-paying-condolences-on-up-former-minister-mulayam-singh-yadav-death
several-political-leaders-paying-condolences-on-up-former-minister-mulayam-singh-yadav-death

By

Published : Oct 10, 2022, 10:53 AM IST

Updated : Oct 10, 2022, 11:36 AM IST

సమాజ్​వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల రాజకీయ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. సుదృఢ భారతదేశం కోసం, ప్రజాస్వామ్యం బలోపేతం కోసం ఆయన విశేష కృషి చేశారని కొనియాడారు. ములాయం కుటుంబసభ్యులకు, ఆయన మద్దతుదారులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

'ధరణి పుత్రుడు' ములాయం
ములాయం సింగ్ మరణం.. భారత దేశానికి తీరని లోటని అన్నారు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము. "'ధరణి పుత్రుడు' ములాయం.. సీనియర్ నేత. అన్ని పార్టీల వారు ఆయన్ను గౌరవించేవారు. సామాన్య నేపథ్యం నుంచి వచ్చి ములాయం సాధించిన విజయాలు.. అసాధారణమైనవి. ములాయం కుటుంబసభ్యులు, మద్దతుదారులకు నా ప్రగాఢ సానుభూతి" అని ట్వీట్ చేశారు ద్రౌపది.

ప్రజాస్వామ్యం కోసం ఓ సైనికుడిలా..
ములాయంతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ములాయం యూపీ సీఎంగా, తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనేకసార్లు కలిశామని.. ఆ తర్వాత కూడా తమ బంధం కొనసాగిందని చెప్పారు.

ములాయం సింగ్, నరేంద్ర మోదీ

"ములాయం.. విశిష్టమైన వ్యక్తి. ప్రజల సమస్యలపట్ల సున్నిత దృక్పథం కలిగిన నేతగా ఆయన్ను అందరూ అభిమానించేవారు. ప్రజల కోసమే ఆయన పనిచేశారు. జయప్రకాశ్​ నారాయణ్, రామ్​ మనోహర్ లోహియా ఆదర్శాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తన జీవితాన్ని అంకితమిచ్చారు. ఉత్తర్​ప్రదేశ్​ సహా దేశ రాజకీయాల్లో ములాయం సింగ్ తనదైన ముద్ర వేశారు. ఎమర్జెన్సీ సమయంలో ప్రజాస్వామ్యం కోసం ఓ సైనికుడిలా పనిచేశారు. రక్షణ మంత్రిగా సుదృఢ భారత దేశ నిర్మాణం కోసం కృషి చేశారు. పార్లమెంటులో ఆయన ప్రశ్నలు, ప్రసంగాలు సూక్ష్మదృష్టితో కూడుకుని ఉండేవి. జాతీయ ప్రయోజనాలకే ములాయం ఎప్పుడూ ప్రాధాన్యం ఇచ్చేవారు" అని ట్వీట్ చేశారు ప్రధాని.

మూడు రోజులు సంతాప దినాలు
ములాయం సింగ్ గౌరవార్థం.. మూడు రోజులు సంతాప దినాలు ప్రకటించింది ఉత్తర్​ప్రదేశ్ ప్రభుత్వం. ఆయన అంత్యక్రియల్ని అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు తెలిపింది.

ములాయం సింగ్​తో యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్​
మరోవైపు.. ములాయం అంతిమ సంస్కారాలు ఆయన స్వస్థలమైన సైఫాయీలో మంగళవారం జరగనున్నట్లు అఖిలేశ్ యాదవ్ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.

దేశరాజకీయాల్లో పూడ్చలేని లోటు..
సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్‌ మరణం దేశ రాజకీయాల్లో పూడ్చలేని లోటు అని కాంగ్రెస్​ పార్టీ ట్వీట్​ చేసింది. ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులకు ఈ నష్టాన్ని తట్టుకునే శక్తి ఇవ్వాలని ప్రార్థిస్తున్నామని తెలిపింది.

జాతీయ రాజకీయాల్లో దృఢమైన నాయకుడు..
యూపీ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ మరణవార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్వీట్​ చేశారు. ములాయం సింగ్ యాదవ్‌తో తనకు సుదీర్ఘ అనుబంధం ఉందని, జాతీయ రాజకీయాల్లో ఆయన ఒక దృఢమైన నాయకుడని వెంకయ్య కొనియాడారు.

ములాయం సింగ్​తో వెంకయ్య నాయుడు

రాజ్​నాథ్​ సింగ్​, అమిత్ షా, కేజ్రీవాల్​ సంతాపం..
రాజకీయ కురువృద్ధుడు ములాయం సింగ్ యాదవ్​ మృతి పట్ల కేంద్రమంత్రులు రాజ్​నాథ్​ సింగ్, అమిత్​ షా​ విచారం వ్యక్తం చేశారు. యూపీ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించిన నాయకుడు అని కొనియాడారు. ఎస్​పీ అధినేత ములాయం సింగ్ మృతి పట్ల దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు ట్వీట్​ చేశారు. ములాయం కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ములాయం సింగ్‌ యాదవ్‌(82) సోమవారం ఉదయం అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హరియాణా గురుగ్రామ్​లోని మేదాంత ఆస్పత్రిలో మరణించారు. ఆరోగ్య సమస్యల రీత్యా ఆగస్టు 22న ఆస్పత్రిలో చేరిన ములాయం.. అప్పటి నుంచి చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడం వల్ల సోమవారం కన్నుమూశారు. ములాయం కుమారుడు, ఎస్​పీ అధినేత అఖిలేశ్ యాదవ్.. ఈ విషయాన్ని ట్విట్టర్​ ద్వారా అధికారికంగా ప్రకటించారు.

Last Updated : Oct 10, 2022, 11:36 AM IST

ABOUT THE AUTHOR

...view details