కర్ణాటకలోని మండ్య తాలూకా దొడ్డకెట్టెగెరె గ్రామంలో విషాదం జరిగింది. వేసవి సెలవులకని అమ్మమ్మ ఇంటికి వెళ్లిన ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు.. విశ్వేశ్వరయ్య అనే కాలువలో ఈత కోసం వెళ్లి అందులో పడి దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులతోపాటు ఇద్దరు యువతులు, ఓ యువకుడు ఉన్నారు. ఇప్పటి వరకు మూడు మృతదేహాలు లభ్యం కాగా మరో ఇద్దరి కోసం గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు. బెంగళూరులో నివాసం ఉండే ఓ కుటుంబం వేసవి సెలవులకని అమ్మమ్మ ఇంటికి వెళ్లారు. ఓ కాలువ వద్దకు ఈతకు వెళ్లగా ప్రమాదవశాత్తు ముందుగా ఓ బాలుడు నీటిలో జారి పడ్డాడు. అతడిని కాపాడే యత్నంలో మిగిలిన నలుగురు కాలువలో దిగి ప్రాణాలు పోగొట్టుకున్నారు.
చిన్నవయసులోనే..
ఈ ఘటనపై బాసరలు పోలీస్ స్టేషన్కు సమాచారం అందించారు గ్రామస్థులు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యల్లో భాగంగా గజ ఈతగాళ్లను రంగంలోకి దింపారు. మృతులు అనీషా బేగం(10), తస్మియా(22), మెహతాబ్(10), అష్రక్(28), అఫికా(22)గా గుర్తించారు పోలీసులు. వీరిలో అష్రక్, అఫికాల మృతదేహాలు ఇంకా వెలికి తీయాల్సి ఉంది. ఇంత చిన్న వయసులోనే పిల్లలు మృత్యుఒడికి చేరడం వల్ల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. కాగా, మృతులందరూ బెంగళూరులోని నీలసంద్ర ప్రాంతానికి చెందినవారు.