బిహార్‌లోని ఔరంగాబాద్‌లో శనివారం తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. వంట చేస్తున్న సమయంలో సిలిండర్ పేలి, భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఛఠ్ పూజకు సిద్ధమవుతున్న వేళ.. ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 30 మందికి పైగా గాయపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.
నగరంలోని శాహ్‌గంజ్ ప్రాంతంలో ఛఠ్ పూజ నిమిత్తం ఓ కుటుంబం శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత రెండు గంటల సమయంలో వంట సిద్ధం చేస్తోంది. సూర్యోదయంలోపు ప్రసాదం తయారుచేసే పనిలో నిమగ్నమైంది. అయితే.. షార్ట్‌సర్క్యూట్ కారణంగా సిలిండర్‌కు మంటలు అంటుకుని.. భారీగా వ్యాపించాయి. వాటిని ఆర్పేందుకు చేసిన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. దీంతో ఈ ఘటనలో 30 మంది గాయాలపాలయ్యారు. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని.. సహాయక చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో కొంతమంది సిబ్బంది కూడా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వెంటనే ఔరంగాబాద్‌లోని సదర్ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.