హిమాచల్ ప్రదేశ్‌లో ప్రకృతి మరోసారి కన్నెర్ర చేసింది. కిన్నౌర్ జిల్లాలోని రెకాండ్ పియో- సిమ్లా రహదారిపై పెద్ద ఎత్తున.. కొండచరియలు విరిగిపడటం వల్ల శిథిలాల కింద 50-60మందికి పైగా చిక్కుకుపోయారు. బుధవారం మధ్యాహ్నం 12:45 గంటలకు ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు.
కిన్నౌర్ నుంచి సిమ్లాకు వెళ్తోన్న హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వ రవాణాకు చెందిన ఓ ప్రయాణికుల బస్సు, ఓ ట్రక్కు, కొన్ని కార్లు కొండచరియల కింద చిక్కుకున్నట్లు ఐటీబీపీ పోలీసులు వెల్లడించారు. బస్సులోనే సుమారు 40 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్లు కిన్నౌర్ డిప్యూటి కమిషనర్ హుస్సేన్ సిద్ధిఖ్ చెప్పారు.
బస్సు డ్రైవర్ సహా 9 మంది సురక్షితం..
ప్రమాదస్థలిలో ఎన్‌డీఆర్‌ఎఫ్, సీఐఎస్ఎఫ్, ఐటీబీపీ 17, 19, 43వ బెటాలియన్ బలగాల ఆధ్వర్యంలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే బస్సు డ్రైవర్, కండక్టర్ సహా.. మరో 12 మందిని బలగాలు రక్షించినట్లు సీఎం జైరామ్ ఠాకూర్ తెలిపారు. బస్సులో ఉన్న ప్రయాణికుల సంఖ్యను తెలిపే స్థితిలో వారు లేరని చెప్పారు. మిగిలిన వారి ఆచూకీ కోసం కూడా బలగాలు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు చెప్పారు.