తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పెళ్లికి వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబంలోని 11 మంది మృతి - సీతామర్హి జిల్లాలో రోడ్డు ప్రమాదం 7గురు మృతి

ఛత్తీస్​గఢ్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది మృతి చెందారు. మరోవైపు బిహార్‌లో జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించారు. నలుగురు గాయపడ్డారు.

Road Accidents In Chattisgarh And Bihar Several Died
ఛత్తీస్​గఢ్ బాలోద్​లో ఘోర రోడ్డు ప్రమాదం 11 మంది మృతి

By

Published : May 4, 2023, 6:33 AM IST

Updated : May 4, 2023, 8:15 AM IST

ఛత్తీస్‌గఢ్‌లోని బాలోద్ జిల్లాలో బుధవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 11 మంది దుర్మరణం పాలయ్యారు. ఒక బాలిక తీవ్రంగా గాయపడింది. పదకొండు మంది ప్రయాణికులతో వెళ్తున్న బొలేరో వాహనాన్ని జగతరా సమీపంలో వేగంగా వస్తున్న ట్రక్కు ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం సంభవించింది. వీరంతా కాంకేర్​ జిల్లాలో బంధువుల వివాహ వేడుకకు హాజరయ్యేందుకు వెళ్తున్నారు. కాగా, మృతులు ధామ్‌తరి జిల్లాలోని సోరెమ్​ భట్‌గావ్ గ్రామంలో నివాసముండే ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం పరీక్షల కోసం.. రాయ్‌పుర్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన ట్రక్కు డ్రైవర్​ కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ తెలిపారు. కాగా, గాయపడిన చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.

సీఎం విచారం..
ఈ విషాదం గురించి తెలుసుకున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్‌ బగేల్‌ బుధవారం అర్ధరాత్రి ట్విట్టర్​ వేదికగా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన బాలిక త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

"బాలోద్‌లో బుధవారం రాత్రి వివాహ వేడుకకు వెళుతున్న బొలెరో వాహనాన్ని ఓ ట్రక్కు ఢీకొంది. ఈ ఘటనలో 10 మంది చనిపోయారు. మృతుల ఆత్మకు శాంతి చేకూర్చి.. వారి కుటుంబాలకు ధైర్యాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. బాలిక పరిస్థితి విషమంగా ఉంది. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను"

- భూపేశ్‌ బగేల్‌, ఛత్తీస్​గఢ్​ సీఎం

చిన్నారులు సహా ఏడుగురు మృతి..!
బిహార్​ సీతామర్హి జిల్లాలోని మగోల్వా ప్రాంతంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు చనిపోయారు. మరో నలుగురు గాయపడ్డారు. పెళ్లి బృందంతో వెళ్తున్న ఓ త్రీవీలర్​ వాహనాన్ని వేగంగా వస్తున్న లారీ ఢీకొనడం వల్ల ఈ ఘోరం జరిగింది. ఈ ప్రమాదంలో చిన్నారులు సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. బుధవారం సాయంత్రం ఓ వివాహ వేడుకకు హాజరై స్వగ్రామానికి తిరిగి వస్తుండగా ఈ విషాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను సీతామర్హిలోని జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు. మృతుల వివరాలను సేకరిస్తున్నామని.. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని సీతామర్హి ఎస్‌డిఓ ప్రశాంత్ కుమార్ తెలిపారు. మృతదేహాలను పోస్ట్​మార్టం పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్​​ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

సీఎం నీతీశ్​ కుమార్​ సంతాపం!
ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేశారు బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

Last Updated : May 4, 2023, 8:15 AM IST

ABOUT THE AUTHOR

...view details