దేశంలోని పలు ప్రాంతాలకు వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. వచ్చే ఐదు రోజుల పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. దక్షిణ భారతదేశంలో విస్తరించి ఉన్న తుపాను ఆవర్తనం.. వర్షాలకు కారణమని పేర్కొంది.
భారత ద్వీపకల్పంలోని నైరుతి రాష్ట్రాల్లో వచ్చే ఐదు రోజుల పాటు వర్ష ప్రభావం ఉంటుందని ఐఎండీకి చెందిన నేషనల్ వెదర్ ఫోర్కాస్టింగ్ సెంటర్ స్పష్టం చేసింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.
తెలంగాణలోనూ..
తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లోని ఘాట్ ప్రాంతాల్లో ఏప్రిల్ 14 నుంచి 16 వరకు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. నైరుతి మధ్యప్రదేశ్‌తో పాటు పరిసర ప్రాంతాల్లోనూ తుపాను ఆవర్తనం ఏర్పడిందని తెలిపింది. ఈ ప్రభావంతో విదర్భ, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా సహా బంగాల్లోని గంగానదీ పరివాహక ప్రాంతాల్లో 4-5 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఝార్ఖండ్‌లో వచ్చే 24 గంటల్లో వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయని తెలిపింది.
వేడి తగ్గదు!
ఏప్రిల్ 14-17 తేదీల్లో పశ్చిమ హిమాలయ ప్రాంతం, ఏప్రిల్ 14-16 తేదీల మధ్య జమ్ము, కశ్మీర్, లద్దాఖ్, గిల్గిత్ బాల్టిస్థాన్, ముజఫరాబాద్, హిమాచల్ ప్రదేశ్‌లోని పలు ప్రాంతాలు వర్షపాతాన్ని నమోదు చేసే అవకాశం ఉందని వెల్లడించింది. అయితే ఈ ప్రభావం ఉష్ణోగ్రతలపై ఉండబోదని తెలిపింది. వచ్చే 4-5 రోజుల పాటు గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో గణనీయమైన మార్పు ఉండకపోవచ్చని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి:'అవసరమైతే రాష్ట్రంలో లాక్‌డౌన్ విధిస్తాం'