కేరళ మలప్పురంలో జరిగిన పర్యటక పడవ బోల్తా ఘటనలో మృతుల సంఖ్య 22కు చేరింది. మృతుల్లో 15 మంది పిల్లలు ఉన్నారు. అయితే మరణించిన వారిలో తానూర్ కునుమ్మల్ సైతలవి కుటుంబానికి చెందిన 12 మంది ఉన్నారు. మరోవైపు ప్రమాదానికి గురైన డబుల్ డెక్కర్ బోటును వెలికి తీశారు అధికారులు. జేసీబీ సాయంతో బోటును ఒడ్డుకు తీసుకొచ్చారు. తీరం నుంచి అర కిలోమీటరు దూరం వెళ్లగానే బోటు ఓ పక్కకు ఒరిగిపోయినట్లు సమాచారం. దీంతో ప్రయాణికులంతా నీట మునిగినట్లు తెలుస్తోంది. కాగా, బోటు యజమాని ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతడిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.
రెస్క్యూ ఆపరేషన్‌లో జాప్యం..
ఆదివారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. అయితే రెస్క్యూ ఆపరేషన్ మాత్రం రాత్రి 8 గంటలకు ప్రారంభమైందని.. అందుకే మృతుల సంఖ్య మరింత పెరిగిందని ఆరోపిస్తున్నారు. బాధితుల కేకలు విన్న స్థానికులు పడవ బోల్తా పడిన విషయం తెలుసుకుని సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం అగ్నిమాపక దళం, ఎన్‌డిఆర్‌ఎఫ్‌లు సంఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ వెలుతురు లేకపోవడం వల్ల సహాయక చర్యలు కష్టతరంగా మారాయి. బోటును ఒడ్డుకు చేర్చేందుకు తొలి ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ప్రమాద బాధితులను ముందుగా చిన్న పడవల్లో ఒడ్డుకు చేర్చారు. అక్కడి నుంచి అంబులెన్స్‌లో వివిధ ఆస్పత్రులకు తరలించారు.
భద్రతా నిబంధనలు ఉల్లంఘించడం వల్లే!
అయితే భద్రతా నిబంధనలు ఉల్లంఘించి బోటు ప్రయాణం చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. బోటుకు లైసెన్స్ లేదని, బోటు సామర్థ్యం కన్నా ఎక్కువ ముందే ప్రయాణించడమే ప్రమాదానికి కారణమని అధికారులు అంటున్నారు. ఓవర్‌లోడ్ వల్లే పడవ బోల్తా పడిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. సాయంత్రం ఆరు గంటల వరకే బోటు యాత్రకు అనుమతి ఉందని.. కానీ ఏడు గంటలకు ప్రమాదం జరగడం వల్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బోటులో ఉన్నవారు లైఫ్ జాకెట్లు వినియోగించలేదని స్థానికులు ఆరోపించారు. కేరళ టూరిజం అనుమతితోనే డబుల్ డెక్కర్ బోట్ సర్వీస్ ఓ ప్రైవేట్ వ్యక్తి నడుపుతున్నట్లు తెలిసింది. భద్రతా సౌకర్యాలు లేకుండా బోటు సర్వీసు నడుపుతున్నట్లు గతంలో ఫిర్యాదులు వచ్చినట్లు స్థానికులు తెలిపారు.