కర్ణాటకలోని కొడగు, బెళగావి, తుమకూరు జిల్లాల్లో శుక్రవారం జరిగిన వేర్వేరు ఘటనల్లో మొత్తం 15 మంది మరణించారు. కొడగులో జరిగిన ప్రమాదంలో 6 మంది మృతిచెందగా.. బెళగావిలోని నదిలో నలుగురు చనిపోయారు. తుమకూరులో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు.
కారు- ఆర్టీసీ బస్సు ఢీ
కొడగు జిల్లాలో కారు, కేఎస్‌ఆర్‌టీసీ బస్సు మధ్య జరిగిన ఘోర ప్రమాదంలో కారులో ఉన్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. జిల్లాలోని మడికేరి తాలూకా సంపాజేలోని పెట్రోల్ బంక్ సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.
రోడ్డు ప్రమాదానికి గురైన బస్సు- కారు మడికేరి నుంచి మంగళూరు వైపు వెళ్తున్న కారు.. మంగళూరు నుంచి మడికేరి వస్తున్న బస్సు ఢీకొన్నాయని పోలీసులు చెప్పారు. ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జునుజ్జయిందని తెలిపారు. కారులో ఉన్న వారంతా మాండ్య జిల్లా మలవల్లి తాలూకాకు చెందిన వారుగా గుర్తించారు. మలవల్లి తాలూకాకు చెందిన కుమార (35), షీలా (29), ప్రియాంక (42), పిల్లలు మనస్వి (8), యషాస్ గౌడ (12), మిషిక (1.5) మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మంజునాథ్‌ను మంగళూరు ఆస్పత్రిలో, బియ్యన్‌గౌడ్‌ను కేవీజీ మెడికల్ కాలేజీలో చికిత్స నిమిత్తం చేర్చినట్లు పోలీసులు తెలిపారు. కొడగు ఎస్పీ రామరాజన్, అదనపు ఎస్పీ సుందరరాజన్ ఘటనాస్థలాన్ని సందర్శించారు.
ఈతకు వెళ్లిన నలుగురు స్నేహితులు మృతి..
బెళగావి జిల్లాలో ఈతకు వెళ్లిన నలుగురు స్నేహితులు ఘటప్రభ నదిలో మునిగి మృతి చెందారు. జిల్లాలోని గోకాక్ తాలూకాలోని దూపదల్ గ్రామ సమీపంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. మృతులను సంతోశ్ బాబు ఇటగి (18), అజయ్ బాబు జోర్ (18), కృష్ణబాబు జోరె (22), ఆనంద్ కొకరే (19)గా పోలీసులు గుర్తించారు. చనిపోయిన నలుగురు యువకులు ఉత్తర కన్నడ జిల్లా ముండగోడ్ తాలూకా హిరిగెరె గ్రామానికి చెందినవారని పోలీసులు తెలిపారు. వీరు ఘటప్రభ నగరంలోని ఓ బార్‌లో పనిచేస్తున్నారని, ఈత కొట్టేందుకు నదికి వెళ్లారని చెప్పారు. మృతదేహాలను స్థానికుల సహాయంతో నదిలో నుంచి బయటకు తీశారు.
కారు- బస్సు ఢీ.. ఐదుగురు దుర్మరణం
తుమకూరు జిల్లాలో ప్రైవేట్ బస్సు, కారు పరస్పరం ఢీకొన్న ఘటనలో ఒకే కుటుంబంలోని నలుగురు సహా ఐదుగురు మృతి చెందారు. మరో ఏడుగురు గాయపడ్డారు. మృతులు బెంగళూరుకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. రోడ్డు డివైడర్‌ను ఢీకొన్న బస్సు అనంతరం ఎస్‌యూవీని ఢీకొట్టిందని స్థానికులు చెబుతున్నారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.