తమిళనాడులోని నమక్కల్ జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. బాణసంచా నిల్వ ఉన్న ఓ ఇంట్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
బాణసంచా నిల్వ ఉన్న ఇంట్లో భారీ పేలుడు.. నలుగురు దుర్మరణం - namakkal crackers blast tragedy
బాణసంచా నిల్వ ఉన్న ఓ ఇంట్లో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా..మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. తమిళనాడులో జరిగిందీ ఘటన.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..జిల్లాలోని మెహనూర్కు చెందిన తిల్లై కుమార్(37).. స్థానికంగా బాణాసంచా వ్యాపారం చేస్తున్నాడు. అతడు లైసెన్స్ కూడా కలిగి ఉన్నాడు. తిల్లై కుమార్.. తన ఇంట్లోనే బాణసంచాను నిల్వ ఉంచాడు. శనివారం తెల్లవారుజామున నాలుగు గంటలకు ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో ఇంట్లో ఉన్న తిల్లై కుమార్, అతడి తల్లి, భార్య ప్రియ అక్కడికక్కడే మరణించారు. అతడి కుమార్తె మాత్రం ప్రాణాలతో బయటపడింది.
పేలుడు ధాటికి తిల్లై కుమార్ ఇల్లు కూడా ధ్వంసమైంది. చుట్టుపక్క ఉన్న మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ప్రభావంతో పొరిగింట్లో ఉండే 70 ఏళ్ల వృద్ధురాలు కూడా మరణించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రిలో చేర్పించారు. అయితే ఘటనకు షార్ట్-సర్క్యూట్ కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.