మధ్యప్రదేశ్ మొరేనా జిల్లాలో ఓ వివాదం.. ఒకే కుటుంబంలోని ఆరుగురి హత్యకు దారి తీసింది. భూమి విషయంలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో కాల్పులు కలకలం రేపాయి. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు.
పోలీసుల సమచారం ప్రకారం..జిల్లాలోని సిహోనియా పోలీస్‌స్టేషన్ పరిధిలో లేపా గ్రామంలో ఈ ఘటన జరిగింది. భూమి విషయంలో ఇరువర్గాల మధ్య చాలా కాలంగా వివాదం నడుస్తోంది. శుక్రవారం ఉదయం పది గంటల ప్రాంతంలో ఆ వివాదం మరింత ముదిరడం వల్ల ఇరు వర్గాలకు చెందిన వ్యక్తులు కాల్పులు జరుపుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు సహా ఒకే కుటుంబంలోని ఆరుగురు మరణించారు.
సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరు వర్గాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఉద్రిక్తత దృష్ట్యా ఆ ప్రాంతంలో భారీగా బలగాలను మోహరించారు. నిందితులంతా పరారయ్యారని.. గాలింపు చర్యలు చేపడుతున్నామని పోలీసులు తెలిపారు. బాధితుల్లో ముగ్గురు అక్కడికక్కడే మరణించారని.. మిగతా వారు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు చెప్పారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.
ఆర్టీసీలో బస్సులో యువతిని పొడిచి.. సూసైడ్‌కు యత్నించి..
ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న యువతిని కత్తితో పొడిచి అనంతరం ఆత్మహత్యకు యత్నించాడు ఓ యువకుడు. కేరళలోని మలప్పురంలో జరిగిందీ ఘటన.
పోలీసుల వివరాల ప్రకారం..
మున్నార్ నుంచి బెంగళూరు వెళ్తున్న కేఎస్‌ఆర్‌టీసీ స్విఫ్ట్ బస్సులో సీత అనే యువతి ప్రయాణిస్తోంది. బస్సు వెన్నియూర్ ప్రాంతానికి రాగానే.. వెనుక సీట్లో ఉన్న యువకుడు ఆమెను కత్తితో పొడిచాడు. అనంతరం ఆ యువకుడు గొంతు కోసుకున్నాడు. వీరిద్దరూ గతంలో స్నేహితులని పోలీసులు చెబుతున్నారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు.. ఇద్దరినీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
కత్తితో పొడిచి.. పెట్రోల్ పోసి నిప్పింటించి..
ప్రభుత్వాసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు ఆమె భర్త. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. తమిళనాడులో ఈ ఘటన జరిగింది.
టుటికోరిన్ జిల్లా శంకరలింగపురం కీజాతేరుకు చెందిన బాలసుబ్రమణ్యం భార్య అయ్యమ్మాళ్ (45).. స్థానిక ప్రభుత్వ వైద్య కళాశాలలో నర్సుగా పనిచేస్తోంది. అన్నానగర్ ప్రాంతంలోని ఓ ఇంట్లో ఆమె తన భర్త, కుమారులతో అద్దెకు ఉంటోంది. గురువారం ఉదయం అయ్యమ్మాళ్ యథావిథిగా పనికి వెళ్లింది. సాయంత్రం ఏడు గంటలకు పని ముగించుకుని ఆసుపత్రి నుంచి బయటకు వచ్చింది. ఆమెను భర్త బాలసుబ్రహ్మణ్యం బైక్‌పై ఇంటికి తీసుకెళ్లాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.
ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన బాలసుబ్రమణ్యం.. అయ్యమ్మాళ్ను కత్తితో పొడిచాడు. తన వద్ద ఉన్న కిరోసిన్ ఆమెపై పోసి నిప్పంటించాడు. అయ్యమ్మాళ్ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనలో బాలసుబ్రమణ్యానికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు అయ్యమ్మాళ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్షల కోసం తిరునల్వేలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాలసుబ్రమణ్యం నేరుగా పోలీసుల ఎదుట లొంగిపోయాడు.
గోల్డ్ కోసం స్నేహితురాలి హత్య!
కేరళలోని త్రిసూర్ జిల్లాలో ఓ యువతిని హత్య చేసి అడవిలో పడేశాడు ఆమె స్నేహితుడు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అరెస్ట్ చేశారు. ఆర్థిక వివాదాలే హత్యకు కారణమని పోలీసులు తెలిపారు. గత నెల 29వ తేదీ నుంచి మృతురాలు అతిర కనిపించడం లేదు. గురువారం రాత్రి అతిరప్పిల్లి తుంబురుముజి సమీపంలోని అడవిలో యువతి మృతదేహం లభ్యమైంది. విచారణ చేసిన పోలీసులకు అఖిల్, అతిర కలిసి కారులో వెళ్తున్నట్లు సమాచారం అందింది. దీని ఆధారంగా అఖిల్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా హత్య విషయం బయటపడింది. అతిర కొద్దరోజుల క్రితం.. తన బంగారు ఆభరణాలను అఖిల్‌కు ఇచ్చిందని.. తిరిగి అడగడం వల్గే అతడు హత్య చేశాడని పోలీసులు తెలిపారు.