విషాదం.. ఇంటి గోడ కూలి 13 మంది దుర్మరణం
08:35 September 16
విషాదం.. ఇంటి గోడ కూలి 13 మంది దుర్మరణం
Wall Collapsed In Lucknow : ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూలో విషాదం నెలకొంది. దిల్కుషా ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఇంటి గోడ కూలి ఇద్దరు చిన్నారులు సహా 13 మంది మృతి చెందారు. పది మందికి పైగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు.. స్థానికుల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే గురువారం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురువడం వల్లే గోడ కూలిపోయిందని అధికారులు చెబుతున్నారు. ఆ గోడ పక్కనే ఉన్న గుడిసెల్లో నివసిస్తున్న తొమ్మిది మంది బలయ్యారని తెలిపారు.
మరోవైపు, ఉన్నావ్ జిల్లాలో కురిసిన వర్షాలకు ఓ ఇంటి పైకప్పు కూలింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు మరణించారు. ఈ దుర్ఘటనలపై రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు, క్షతగాత్రులకు రూ.2లక్షల చొప్పున ఆర్థికసాయం ప్రకటించారు. ఘటనపై లఖ్‌నవూ పార్లమెంట్ సభ్యుడు, కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
యూపీతో పాటు మహారాష్ట్ర, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లోనూ వర్షాలు ముంచెత్తాయి. వర్షాల కారణంగా యూపీలో కొన్ని ప్రాంతాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. అటు ముంబయిలోనూ జోరు వానలు కురుస్తున్నాయి.