గుడికి వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం.. 26 మంది దుర్మరణం - చెరువులోకి బోల్తా కొట్టిన ట్రాక్టర్
21:56 October 01
గుడి నుంచి వస్తుండగా ట్రాక్టర్ బోల్తా.. 26 మంది దుర్మరణం
ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పుర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఘతంపుర్ ప్రాంతంలో శనివారం రాత్రి భక్తులతో వెళ్తున్న ఓ ట్రాక్టర్ అదుపు తప్పి చెరువులో బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో 26 మంది భక్తులు మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు మొదలుపెట్టారు. స్థానికుల సహాయంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. బాధితులంతా చంద్రికా దేవి ఆలయాన్ని సందర్శించి తిరిగి తమ స్వగ్రామమైన కోర్తాకు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రమాద సమయంలో ట్రాక్టర్లో 50 మంది ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
మోదీ, యోగి సంతాపం..
ఈ ఘోర రోడ్డు ప్రమాదంపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. మరణించిన వారి కుటుంబసభ్యులకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు మోదీ. ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. ట్విట్టర్ వేదికగా సంతాపం వ్యక్తం చేశారు.