మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న ఓ ట్రక్కు అదుపుతప్పి.. రోడ్డుపై ఆగి ఉన్న ఓ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో 14 మంది మృతి చెందగా.. దాదాపు 50 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. సిద్ది జిల్లాలోని రేవా-సత్నా సరిహద్దుల్లోని మోహనియా ప్రాంతంలో.. రాత్రి 9 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.
సత్నాలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగించిన ఓ కార్యక్రమానికి వెళ్లి తిరిగి బస్సుల్లో వస్తున్నారు. అయితే ఆహార పొట్లాల కోసం రోడ్డు పక్కనే రెండు బస్సులను ఆపారు. అదే సమయంలో అటుగా వస్తున్న ఓ ట్రక్కు టైర్ పేలిపోవడం వల్ల అదుపుతప్పి.. రోడ్డుపై ఆగి ఉన్న బస్సులను ఢీకొట్టింది. దీంతో ఓ బస్సు అదుపుతప్పి గుంతలో పడగా.. మరో బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందగా.. మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
మృతులకు అమిత్ షా సంతాపం తెలిపారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఘటన స్థలాన్ని చేరుకుని మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. మృతుల కుటంబాలకు రూ. 10లక్షల పరిహారాన్ని ప్రకటించారు. దీంతో పాటుగా తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు, స్వల్ప గాయాలైన వారికి రూ. 1 లక్ష చొప్పున పరిహారాన్ని ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ కుడా తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.50 లక్షలు, గాయపడిన వారికి రూ.5 లక్షల పరిహారం అందజేయనున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారు.