Uttarakhand Accident Car : ఉత్తరాఖండ్లో లోయలో కారు బోల్తా పడిన ఘటనలో 10 మంది మరణించారు. పిథౌరాగఢ్ జిల్లాలోని ఓ ఆలయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన బొలేరో వాహనంలో డ్రైవర్ సహా 10 ఉన్నారని, ఎవరూ ప్రాణాలతో బయటపడలేదని అధికారులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. జిల్లాలోని మునిషారి- హోక్రా సమీపంలో గురువారం ఉదయం 7.30 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. 600 మీటర్ల లోతులో ఉన్న లోయలో అదుపు తప్పి వాహనం బోల్తా పడింది.
పరుగులు తీసిన స్థానికులు..
ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు.. బాధితులను రక్షించేందుకు పరుగులు తీశారు. వెంటనే పోలీసులకు విషయాన్ని తెలియజేశారు. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని హుటాహుటిన స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు.
కోకిలా దేవి ఆలయానికి వెళ్తుండగా..
Uttarakhand Car Accident News : బాధితులంతా బాగేశ్వర్ జిల్లాలోని సామా గ్రామానికి చెందిన నివాసితులుగా పోలీసులు గుర్తించారు. హోక్రాలో ఉన్న కోకిలా దేవి ఆలయానికి బాధితులంతా వెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు. గత రాత్రి కురిసిన భారీ వర్షాలకు రోడ్డు బురదమయమైందని చెప్పారు. అందుకే ఈ ఘోర ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు.
వైష్ణోదేవి గుడికి వెళ్తూ..
Jammu Bus Accident : ఆనందంగా వేడుక జరుపుకొంటున్న ఆ కుటుంబంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. చిన్నారి తల వెంట్రుకలు తీసేందుకు బంధువులతో కలిసి గుడికి వెళ్తుండగా బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. మే 30న జరిగిన ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 10 మంది మరణించగా.. మరో 57 మందికి గాయాలయ్యాయి. పంజాబ్ అమృత్సర్కు చెందిన ఓ కుటుంబం.. చిన్నారికి తల వెంట్రుకలు తీసేందుకు మాతా వైష్ణోదేవి ఆలయానికి వెళ్లాలని అనుకుంది. ఈ వేడుక కోసం బిహార్ నుంచి బంధువులు సైతం వచ్చారు. వీరంతా కలిసి ఓ ప్రైవేట్ బస్సులో మాతా వైష్ణోదేవి ఆలయానికి బయలుదేరారు.
సాధారణంగా వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే భక్తులు.. కత్రాలోని బేస్ క్యాంప్ మీదుగా ప్రయాణిస్తుంటారు. ఈ క్రమంలోనే కత్రా ప్రాంతానికి వెళ్తుండగా.. మంగళవారం ఉదయం జజ్జర్ కోట్లీ వద్ద ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు చేపట్టినట్లు జమ్ము సీనియర్ సూపరింటెండెంట్ పోలీస్ చందన్ కోహ్లీ తెలిపారు. గాయపడిన వారిని జమ్ములోని జీఎంసీ ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. బస్సులో చిక్కుకున్న వారందరినీ బయటకు తీసినట్లు తెలిపారు. బస్సులో పరిమితికి మించి ప్రయాణికులు ఉన్నారని చందన్ కోహ్లీ వివరించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన ఫొటోలు చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.