17 ATMs Closed: కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియా పేరుతో వివిధ పథకాలను అమలు చేస్తోంది. డిజిటల్ చెల్లింపులపై ప్రజలకు, దుకాణదారులకు అవగాహన కల్పిస్తోంది. చిన్నచిన్న గ్రామాల్లో సైతం ఏటీఎం మెషీన్లు ఏర్పాటు చేస్తోంది. గ్రామీణ ప్రజలు కూడా ఇటీవల కాలంలో డబ్బులు విత్‌డ్రా చేయడానికి, డిపాజిట్ చేయడానికి బ్యాంక్‌కు వెళ్లకుండా.. అన్నిరకాల బ్యాంకింగ్ పనులు తమ ఊర్లో ఉన్న ఏటీఎంలోనే పూర్తి చేసుకుంటున్నారు. అయితే ఇదే అదనుగా తీసుకున్న బిహార్.. గోపాల్‌గంజ్ జిల్లాలోని దొంగలు రెచ్చిపోతున్నారు.
గత మూడు నెలలుగా ప్రతిరోజూ రాత్రి పలు గ్రామాల్లో ఉన్న ఏదో ఒక ఏటీఎంను టార్గెట్ చేసుకుని.. రూ.లక్షల్లో లూటీ చేస్తున్నారు. దీంతో దొంగతనాలను అరికట్టడం బిహార్ పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది. చివరికి కొన్ని గ్రామాల ఏటీఎంలు సురక్షిత ప్రాంతాల్లో లేవని గుర్తించి ఓ నిర్ణయానికి వచ్చారు. 17 టాటా ఇండిక్యాష్ ఏటీఎంలను తాత్కాలికంగా మూసివేశారు పోలీసులు.
"గత మూడు నెలల నుంచి ఏటీఎం దొంగతనాలు బాగా ఎక్కువయ్యాయి. రాత్రి సమయంలో దొంగలు గ్యాస్ కటర్లతో కట్ చేసి దోచుకెళ్తున్నారు. హార్దియా గ్రామంలో రెండు ఏటీఎంల నుంచి సుమారు రూ.7 లక్షలు ఎత్తుకెళ్లారు. సరైన భద్రత లేని ప్రదేశాల్లో ఎవరి అనుమతితో బ్యాంకులు ఏర్పాటు చేశారన్న కోణంలో దర్యాప్తు చేపడుతున్నాం. ప్రస్తుతానికి 17 టాటా ఇండిక్యాష్ ఏటీఎంలను మూసేవేశాం. సురక్షిత ప్రాంతాలకు తరలించే వరకు వాటిని తెరవలేం. జనసమూహం ఉన్న ప్రాంతాల్లో మాత్రమే తిరిగి వాటిని ప్రారంభిస్తాం."
-- సంజీవ్ కుమార్, ఎస్డీపీఓ