Seven people died in a fire: దిల్లీ గోకుల్‌పురి ప్రాంతంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. శుక్రవారం రాత్రి.. నగర శివార్లలోని గుడిసెల్లో మంటలు చెలరేగి, ఏడుగురు మరణించారు. మృతుల్లో ఇద్దరు పురుషులు, ముగ్గురు బాలికలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా శ్రమించి మంటలను అదుపు చేసి.. మృతదేహాలను వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని జీటీబీ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మంటల్లో దాదాపు 60 గుడిసెలు దగ్ధమైనట్లు అధికారులు తెలిపారు.
అసలు కారణమిదే!
"ఘటనాస్థలానికి సమీపంలో టైర్ల ఫ్యాక్టరీ ఉంది. ఆ ఫ్యాక్టరీలో శుక్రవారం రాత్రి మంటలు చెలరేగాయి. అగ్నిజ్వాలలు ఎగసిపడి.. క్రమంగా పక్కనే ఉన్న మురికివాడలకు వ్యాపించాయి. అందరూ నిద్రిస్తున్న సమయంలో ప్రమాదం సంభవించింది. దీంతో భారీగా ఆస్తి నష్టం, ప్రాణనష్టం జరిగింది" అని స్థానికులు తెలిపారు. తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబాలు.. ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాయి. అయితే ఈ ప్రమాదానికి గల కారణంపై ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు.
దిల్లీ సర్కారు పరిహారం
కాగా, ఘటన జరిగిన ప్రదేశాన్ని దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సందర్శించారు. ప్రాణనష్టంపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన వయోజనుల కుటుంబాలకు రూ.10 లక్షలు, చిన్నారుల కుటుంబాలకు రూ.5 లక్షలు పరిహారం ప్రకటించారు. గుడిసెలు కాలిపోయిన వారికి రూ.25 వేల చొప్పున అందించనున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి:కాఫీ తోటలో కార్మికులపై ఏనుగు దాడి- ఇద్దరు మృతి