బిహార్లోని కాటిహార్ జిల్లాలో పోలీసులపై గ్రామస్థులు దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన పోలీసులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే కల్తీ మద్యం కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న ఓ వ్యక్తి కస్టడీలో చనిపోవడం వల్ల అతడి గ్రామస్థులు దాడికి దిగారు.
పోలీసుల వివరాలు ప్రకారం..శుక్రవారం రాత్రి అమ్డోల్ గ్రామానికి చెందిన ప్రమోద్ కుమార్ సింగ్(40)ను కల్తీ మద్యం కేసులో ప్రాణ్పుర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే శనివారం ఉదయం.. అతడు అనుమానాస్పద రీతిలో జైలులోనే చనిపోయాడు. దీంతో గ్రామస్థులు పోలీస్స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. స్టేషన్ ఆవరణలో ఉన్న వాహనాలను ధ్వంసం చేశారు. అదే సమయంలో స్టేషన్లోకి చొరబడి పోలీసులపై కర్రలు, ఇనుపరాడ్లతో దాడికి దిగారు. ఈ ఘటనలో గాయపడిన ఏడుగురు పోలీసులను కాటిహార్ జిల్లా ఆస్పత్రికి అధికారులు తరలించారు.
ప్రమోద్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామని, పోలీసులపై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేశామని అధికారులు తెలిపారు.