ఉత్తర్‌ప్రదేశ్ షాజహాన్‌పుర్‌లో లఖ్‌నవూ-బరేలీ జాతీయ రహదారి పక్కన 60 శాతం కాలిన గాయాలతో, నగ్నంగా పడి ఉన్న యువతి కేసులో కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. రైఖేదా ప్రాంతం వద్ద పంటపొలాల సమీపంలో ఆమె పడి ఉందని సమాచారం అందిన అనంతరం.. పోలీసులు బాధితురాలిని జిల్లా ఆసుపత్రిలో చేర్చారు. అనంతరం.. లఖ్‌నవూలోని వేరే ఆసుపత్రికి తరలించారు.
కిరోసిన్ పోసి.. నిప్పంటించి..!
బాధితురాలి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని.. వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్న ఆ యువతిని ప్రశ్నించారు పోలీసులు. ఆమె తరచూ తన వాంగ్మూలాన్ని మార్చుకుంటోందని పోలీసులు తెలిపారు. తనపై సామూహిక అత్యాచారానికి ప్రయత్నించిన ముగ్గురిని అడ్డుకోగా.. వారు కిరోసిన్ పోసి నిప్పంటించారని బాధితురాలు పోలీసులకు చెప్పింది.
పొంతనలేని వాంగ్మూలాలు..!
కేంద్ర మాజీ మంత్రి స్వామి చిన్మయానంద్ ఆధ్వర్యంలోని ముముక్షు ఆశ్రమం నిర్వహిస్తున్న స్వామి సుఖ్‌దేవానంద్ కళాశాలలో ఆమె బీఏ ద్వితీయ సంవత్సరం చదువుతోంది.
అయితే.. కళాశాల భవనంలోని మూడో అంతస్తు నుంచి ఆసుపత్రికి ఎలా చేరుకుందో తనకు తెలియలేదని ఆ యువతి చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. సీసీటీవీ ఫుటేజీలో మాత్రం.. మూడో అంతస్తు నుంచి ఆమె ఒంటరిగానే నడుస్తూ కనిపించిందని స్పష్టం చేశారు పోలీలుసు.
''సీసీటీవీ ఫుటేజీ ప్రకారం.. కళాశాలలోకి ప్రవేశించిన 20 నిమిషాలకు ఆ విద్యార్థిని క్యాంపస్‌లో విరిగిన గోడ మార్గం ద్వారా బయటికి వెళ్లింది. ఆ తర్వాత కెనాల్ రోడ్ వెంబడి ఒంటరిగానే నడిచింది.''