సమీర్ వాంఖడే (NCB officer Sameer Wankhede).. మాదక ద్రవ్యాల 'తెర'చాటు వ్యవహారాలపై ఆయనో సింహ స్వప్నం. డ్రగ్స్ ముఠాల గుట్టు రట్టు చేయడమే కాకుండా.. నిందితులు ఎంత పెద్ద సెలబ్రిటీలు అయినా విడిచిపెట్టరని పేరున్న నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూర్ (ఎన్సీబీ) జోనల్ అధికారి (Sameer Wankhede news). అయితే.. ఇదంతా ఒకప్పుడు. ఇప్పటి సమీర్ వాంఖడే వివాదాలకు కేంద్ర బిందువు. ఆయన పుట్టుక మొదలుకొని పెళ్లి, ఉద్యోగం అన్నింటిపైనా తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. కొద్దిరోజుల కిందటి వరకు సూపర్ హీరోగా ఉన్న ఆయన.. ఇప్పుడు వివాదాల్లో చిక్కుకున్నారు. అసలు ఇదంతా ఎలా మొదలైంది..?
ఆర్యన్ అరెస్టుతో..
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తనయుడు.. ఆర్యన్ ఖాన్‌ను (NCB Drug case Bollywood) అరెస్టు చేసింది సమీర్ నేతృత్వంలోని ఎన్సీబీ బృందమే. క్రూయిజ్ నౌకపై దాడి జరిపి నిందితుల దగ్గర నుంచి భారీగా మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. ఆర్యన్ (shah rukh khan son news) సహా పలువురిని అరెస్టు చేశారు. అప్పుడు మొదలైంది ఆరోపణల పర్వం.
డ్రగ్స్ కేసుకు (Cruise Drug Case) చెందిన ఓ సాక్షి.. ఆర్యన్‌ను విడుదల చేసేందుకు సమీర్ వాంఖడే (NCB officer Sameer Wankhede) షారుక్ నుంచి రూ. 25 కోట్లు డిమాండ్ చేసినట్లు ఆరోపించారు. దీనిపై దృష్టి సారించిన ఎన్సీబీ చర్యలు ముమ్మరం చేసింది. ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ జ్ఞానేశ్వర్ సింగ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బృందంతో దర్యాప్తు చేయిస్తోంది.
నవాబ్ మాలిక్ అటాక్..
ఇదే సమయంలో సమీర్‌ను (NCB Sameer Wankhede) లక్ష్యంగా చేసుకొని.. కొద్దిరోజులుగా వరుస ఆరోపణలు చేస్తున్నారు మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ (Nawab Malik Sameer Wankhede). వ్యక్తిగత జీవితంపైనా ప్రశ్నలు గుప్పించారు. పుట్టుక, పెళ్లి మొదలుకొని ఉద్యోగం అన్నింటిపైనా అనుమానం వ్యక్తం చేశారు.
సమీర్ పుట్టుకతోనే ముస్లిం అని.. ఆయన అసలు పేరు సమీర్ దావూద్ వాంఖడే అని తెలిపారు. సంబంధిత ఫొటోను కూడా షేర్ చేశారు. ముస్లిం యువతిని పెళ్లి చేసుకున్నప్పటి ఫొటోలు సహా నిఖా నామాను (పెళ్లి అంగీకార పత్రం) కూడా ట్విట్టర్లో బహిర్గతం చేశారు మాలిక్(Nawab Malik news).
సమీర్ తండ్రి అసలు పేరు దావూద్ వాంఖడే అని, జ్ఞాన్దేవ్ వాంఖడే కాదని ఆరోపించారు.
ఫోర్జరీ పత్రాల ద్వారా హిందూ ఎస్సీ కోటాలో ఉద్యోగాన్ని సంపాదించారని, ఇంకా.. బాలీవుడ్ ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేసి లంచం డిమాండ్ చేశారని మాలిక్ (Nawab Malik news) ఆరోపించారు.
ఈ ఆరోపణలపై దృష్టి సారించిన ముంబయి పోలీసు విభాగం.. విచారణకు సిద్ధమైంది.
మొదటి పెళ్లిపై..
నవాబ్ మాలిక్ (Nawab Malik news) ఆరోపణల నేపథ్యంలో.. 15 ఏళ్ల కిందట సమీర్ పెళ్లి జరిపించిన ఇస్లాం మత పెద్ద ఖాజీ మౌలానా అహ్మద్ స్పందించారు. వివాహం సమయంలో.. సమీర్ (Sameer wankhede ncb officer) ముస్లిం వ్యక్తేనని తేల్చిచెప్పారు. ఒకవేళ ముస్లిం కాకుంటే.. పెళ్లి జరిపించేవాడినే కాదన్నారు.
''సమీర్ వాంఖడే-షబానా ఖురేషీ నిఖా నేనే జరిపించాను. ముంబయి లోఖండ్వాలా కాంప్లెక్స్ ప్రాంతంలో పెళ్లి జరిపించాలని ఆ యువతి తండ్రి నన్ను కలిశారు. షబానాను పెళ్లి చేసుకున్న వ్యక్తి పేరు సమీర్ దావూద్ వాంఖడే. అసలు సమీర్ ముస్లిం కాకుంటే నేను పెళ్లి జరిపించకపోయేవాడిని.''
- మౌలానా, ఖాజీ