gun firing at shamirpet celebrity club : మేడ్చల్ జిల్లా శామీర్‌పేటలోని సెలబ్రిటీ క్లబ్ విల్లాలో చోటు చేసుకున్న కాల్పుల ఘటనపై శామీర్ పేట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మనోజ్ అనే వ్యక్తి తనపై కాల్పులు జరిపినట్లు సిద్దార్థ్.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఎయిర్ గన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఎయిర్ గన్‌ను పేల్చిన ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని పోలీసులు నిర్ధారించుకున్నారు.
కుటుంబ సమస్యల కారణంగా ఈ కాల్పులు జరిగాయని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. వైజాగ్‌కు చెందిన సిద్దార్థ్ దాస్‌కు, ఒడిశాలోని బరంపురకు చెందిన స్మితతో 20ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఇద్దరికి 17ఏళ్ల కుమారుడు, 13ఏళ్ల కుమార్తె ఉన్నారు. గత కొన్నేళ్లుగా ఇద్దరికీ మనస్పర్థలు తలెత్తడంతో వేర్వేరుగా ఉంటున్నారు. 2019లో స్మిత విడాకుల కోసం కోర్టును ఆశ్రయించింది. తన ఉంటున్న చోటికి సిద్దార్థ్ రాకుండా కోర్టు నుంచి ఆర్డర్ కూడా తెచ్చుకుంది. సిద్ధార్థ్ ప్రస్తుతం వైజాగ్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. స్మిత మాత్రం మనోజ్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది.
మనోజ్ మమ్మల్ని కొడుతున్నాడు: శ్రీకాకుళం జిల్లాకు చెందిన మనోజ్‌తో స్మితకు ఇది వరకే పరిచయం ఉంది. భర్తకు దూరమైన తర్వాత మనోజ్ తోనే సెలబ్రిటీ విల్లాలో కలిసి ఉంటోంది. తన కుమారుడు, కుమార్తెతో కలిసి స్మిత విల్లాలోనే ఉంటుంది. ఈనెల 12వ తేదీన స్మిత కుమారుడు బాలల సంరక్షణ కమిటీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. మనోజ్ కొడుతున్నాడని ఫిర్యాదు చేయడంతో సీడబ్ల్యూసీ అధికారులు స్మిత కుమారుడిని తమ సంరక్షణలోనే ఉంచుకున్నారు. తన చెల్లిని కూడా మనోజ్ కొడుతున్నాడని అధికారులకు చెప్పడంతో, స్మితకు బాలల సంరక్షణ కమిటీ అధికారులు లేఖ రాశారు.
18వ తేదీన కుమార్తెను తీసుకొని సిడబ్ల్యూసీ ముందు హాజరుకావాలని ఆదేశించారు. మనోజ్ కొడుతున్న విషయాన్ని స్మిత కుమారుడు తన తండ్రి సిద్దార్థ్ దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో సిద్ధార్థ్ వైజాగ్ నుంచి హైదరాబాద్‌కు చేరుకొని ఈ రోజు ఉదయం సెలబ్రిటీ క్లబ్‌కు వెళ్లాడు. మనోజ్, స్మితాల నివాసం ఉంటున్న విల్లా వద్దకు వెళ్లగా.. పిల్లలను కొట్టారన్న విషయంలో ఇద్దరితో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో మనోజ్ తన వద్ద ఉన్న ఎయిన్ గన్‌తో గాల్లోకి కాల్పులు జరిపాడు. సిద్దార్థ్ భయాందోళనకు గురై డయల్ 100కు ఫిర్యాదు చేశాడు.
ఎయిర్‌గన్ స్వాధీనం: ఆ తర్వాత శామీర్ పేట్ పీఎస్ చేరుకొని విషయాన్ని పోలీసులకు వివరించాడు. సిద్దార్థ్ ఫిర్యాదు ఆధారంగా శామీర్ పేట్ పోలీసులు మనోజ్, స్మితలను అదుపులోకి తీసుకున్నారు. మనోజ్ ఉపయోగించిన ఎయిర్ గన్‌ను స్వాధీనం చేసుకొని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరికి పంపించారు. ఆయుధం ఉపయోగించడంతో పాటు.. కాల్పులు జరిపినందుకు మనోజ్‌పై పలు సెక్షన్ల కింద శామీర్ పేట్ పోలీసులు కేసు నమోదు చేశారు. పిల్లలను కొట్టారనే దానిపై ఇప్పటికే అల్వాల్‌లోని బాలల సంరక్షణ కమిటీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. సిద్దార్థ్ కుమారుడు, కుమార్తె వాంగ్మూలాలను నమోదు చేసుకొన్న తర్వాత సిడబ్ల్యూసి అధికారులు నివేదిక రూపొందించనున్నారు. ఆ నివేదిక ఆధారంగా పోలీసులు తదుపరి చర్యలు తీసుకోనున్నారు.
"సిద్దార్థ్, స్మిత భార్యభర్తలు. 2009 నుంచి వారి మధ్య విభేదాలు వలన విడివిడిగా ఉంటున్నారు. స్మిత ఇద్దరు పిల్లలతో కలిసి శామీర్‌పేట్‌లోని సెలబ్రిటీ రిసార్ట్‌లో మనోజ్ అనే వ్యక్తితో మూడేళ్లుగా ఉంటుంది. పిల్లలను చూడడానికి ఇవాళ సిద్దార్థ్.. స్మిత వద్దకు వచ్చారు. ఈ క్రమంలో మనోజ్, సిద్దార్థ్‌కు మధ్య గొడవ జరిగింది. దీంతో మనోజ్ కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. సిద్దార్థ్ పిల్లలు.. మనోజ్‌పై చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి ఫిర్యాదు చేశారు. "- సందీప్, మేడ్చల్ డీసీపీ
శామీర్‌పేట్ సెలబ్రిటీ క్లబ్‌లో కాల్పుల కలకలం ఇవీ చదవండి: