మనుషులైనా, జంతువులైనా.. తల్లిలేని జీవితం ఏ బిడ్డకైనా అంధకారమే. ఈ మాటలకు నిదర్శనం ఈ రెండు చిరుతపులి పిల్లలు. 2014లో స్థానికులు రక్షించి, వన్యప్రాణి పునరావాస, సంరక్షణ కేంద్రం సీడబ్ల్యూఆర్‌సీ అధికారులకు అప్పగించిన పులిపిల్లలివి.
అసోం, జోర్హట్ జిల్లాలోని మరియానీ సమీపంలో ఉన్న ఓ అడవి నుంచి స్థానికులు ఈ పులి పిల్లలను రక్షించారు. అనంతరం సీడబ్ల్యూఆర్‌సీ అధికారులకు అప్పగించారు. అప్పటినుంచి అక్కడే ఉన్నాయి. తల్లి సంరక్షణలో పెరగకపోవడం వల్ల.. పెద్దైనా తమకోసం తామే వేటాడుకోలేని పరిస్థితుల్లో ఉన్నాయీ చిరుతలు. అందుకే వీటిని అడవుల్లో వదిలిపెట్టలేమని చెబుతున్నారు అధికారులు
" వేటకోసమో, ఆహారం లేదా నీటి కోసమో వెళ్లినప్పుడు.. పిల్లలను సురక్షిత ప్రాంతంలో వదిలి వెళ్తాయి తల్లులు. అవి ప్రజల కంటబడితే.. అనాథలనో, తల్లిదండ్రులు చనిపోయారనో భావిస్తారు. సమీపంలోని అటవీ కార్యాలయానికి సమాచారమిస్తారు. కానీ అది సరైనది కాదు. తల్లి సంరక్షణ నుంచి పిల్లలను దూరం చేస్తే, అవి బలహీనంగా మారతాయి. తల్లిదగ్గరే పెరగడమే మంచిది. లేకపోతే వేటాడడం లాంటి సహజ లక్షణాలు అలవర్చుకోలేవు. మనుషులకు ఆకర్షితులై, వాళ్లలాగే నివసించాలనుకుంటాయి. ఇక తిరిగి అడవుల్లోకి వెళ్లి, బతకలేవు. అడవుల్లో బతకడానికి అత్యవసరమైన వేటను అవి ఎప్పటికీ నేర్చుకోలేవు."
- డా. అభిజీత్ చౌదరి, పశువైద్యుడు