రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతారని అర్థమయ్యే.. సాగు చట్టాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. రైతులు లేకుంటే దేశం లేదనే వాస్తవిక పరిస్థితులు ప్రధాని నరేంద్ర మోదీకి ఇప్పుడు అర్థమవుతున్నాయని అన్నారు.
ఎంతమంది రైతులు అమరులైనా పట్టించుకోలేదని మోదీ ప్రభుత్వంపై ప్రియాంక మండిపడ్డారు. భాజపా నేతలు రైతులను.. ఉగ్రవాదులు, గూండాలు, దుండగులు అని సంబోధించారని అన్నారు.
''600 మంది రైతులు అమరులయ్యారు. 350 రోజులకుపైగా రైతులు పోరాటం చేశారు. వారిని కర్రలతో కొట్టారు. అరెస్టులు చేశారు. మీ మంత్రి తనయుడు.. రైతులను చంపారు. కానీ .. మీరు ఏనాడూ లెక్క చేయలేదు. ఇప్పుడు మారుతున్న మీ వైఖరి, ఉద్దేశాలు అర్థం చేసుకోవడం కష్టం.''
- ప్రియాంకా గాంధీ వాద్రా, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి
రైతులే నిజమైన దేశ రక్షకులు అన్న ప్రియాంక.. వారి ప్రయోజనాలను తుంగలో తొక్కి ఏ ప్రభుత్వమూ దేశాన్ని సక్రమంగా నడపలేదని వ్యాఖ్యానించారు.
రైతుల విజయం..
కేంద్ర ప్రభుత్వ అహంకారంపై.. రైతు గెలిచాడని కాంగ్రెస్ పేర్కొంది. ప్రభుత్వం బలవంతంగానైనా సాగు చట్టాలను రద్దు చేస్తుందని.. గతంలో తాను చెప్పిందే నిజమైందని ట్వీట్ చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. అప్పుడు మాట్లాడిన వీడియోను కూడా షేర్ చేశారు.