భారత్, అమెరికా మధ్య మరికొద్ది రోజుల్లో జరగనున్న నాలుగో విడత 2+2 మంత్రుల స్థాయి సమావేశానికి ముందు ఇరు దేశాల ఉన్నతాధికారులు వాషింగ్టన్లో సమావేశమయ్యారు. మంత్రుల సమావేశం సన్నద్ధపై సమీక్షతో పాటు రక్షణ, ప్రజారోగ్యం, ఆర్థిక రంగాల్లో ద్వైపాక్షిక సహకారం పురగోతిపై ఇరు దేశాల అధికారులు బుధవారం చర్చించినట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది.
దక్షిణాసియా, ఇండో పసిఫిక్ ప్రాంతాలతో పాటు పశ్చిమ హిందూ మహాసముద్రంలో ఇటీవలి పరిస్థితులపై అంచనాలను ఇరు దేశాలు అందించుకున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. అలాగే.. 2020, అక్టోబర్లో జరిగిన 2+2 మంత్రుల స్థాయి సమావేశం తర్వాత పురోగతిపైనా చర్చించినట్లు పేర్కొంది.
"దక్షిణాసియా, ఇండోపసిఫిక్, పశ్చిమ హిందూ సముద్రంలోని తాజా పరిస్థితులు, ఈ ప్రాంతాల్లో శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు కోసం తమ ప్రణాళికలను పంచుకున్నారు. రక్షణ, ప్రజారోగ్యం, ఆర్థికం, వాణిజ్య సహకారం, సైన్స్ అండ్ టెక్నాలజీ, స్వచ్ఛ ఇంధనం, వాతావరణ పెట్టుబడులు, ప్రజల మధ్య సంబంధాలపై సహకారాన్ని పెంపొందించేందుకు ఉన్న అవకాశాలపైనా చర్చించారు. అలాగే.. అంతరిక్షం, సైబర్ సెక్యూరిటీ, భవిష్యత్తు సాంకేతికత వంటి రంగాలపైనా చర్చించారు. "
- భారత విదేశాంగ శాఖ.