కరోనాతో సతమతమవుతున్న భారత్కు సాయం అందించడానికి పేద దేశాలు కూడా సిద్ధమవుతున్నాయని.. కానీ మోదీ ప్రభుత్వం మాత్రం సెంట్రల్ విస్టా ప్రాజెక్టును రద్దు చేసేందుకు సిద్ధంగా లేదని శివసేన మండిపడింది. గత 70ఏళ్లలో నెహ్రూ, ఇందిరా గాంధీ, మన్మోహన్ సింగ్ వంటి నేతలు నిర్మించిన వ్యవస్థ కారణంగానే ప్రస్తుత పరిస్థితులను దేశం ఎదుర్కోగలుగుతోందని తెలిపింది. ఆ పార్టీకి చెందిన సామ్నా పత్రికలో ఈ వ్యాఖ్యలు చేసింది.
"భారత్లోని పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని, ఆ దేశాన్ని ఆదుకోవాలంటూ ఇటీవల యూనిసెఫ్ పేర్కొంది. బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, మయన్మార్, శ్రీలంక దేశాలు భారత్కు సాయపడేందుకు సిద్ధమయ్యాయి. ఒకప్పుడు పాకిస్థాన్, కాంగో వంటి దేశాలకు ఈ పరిస్థితి ఉండేది. ప్రభుత్వం తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాల కారణంగా మనకూ ఇప్పుడు ఈ పరిస్థితి పట్టింది. ఈ సమయంలో కూడా రూ.20వేల కోట్లు విలువ చేసే సెంట్రల్ విస్టా ప్రాజెక్టు కొనసాగింపుపై ఎవరికీ చింత లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది."