తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'బలవంతంగా ఖాళీ చేయిస్తే ఉరేసుకోవడానికైనా సిద్ధం' - రైతుల ఉద్యమం

Security
భారీ భద్రతా వలయంలో దిల్లీ

By

Published : Jan 28, 2021, 10:23 AM IST

Updated : Jan 28, 2021, 9:28 PM IST

21:21 January 28

ఉద్రిక్తతల మధ్య..

ఘాజిపూర్​ సరిహద్దులో ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. భారతీయ కిసాన్​ యూనియన్​ ప్రతినిధి రాకేశ్​ తికాయత్​.. ఓ వ్యక్తిపై చేయి చేసుకున్నారు. అతను కర్ర పట్టుకుని తిరుగుతున్నాడని.. మీడియాతో దురుసుగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపించారు తికాయత్​. ఆ వ్యక్తితో యూనియన్​కు సంబంధం లేదన్నారు. దురుద్దేశంతో ఉన్న ఎవరైనా.. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని తేల్చిచెప్పారు.

20:26 January 28

'నిఘా వైఫల్యమే కారణం'

దిల్లీలోని ఎర్రకోట వద్ద అల్లర్లు జరగడానికి నిఘా వైఫల్యమే కారణమని కాంగ్రెస్​ నేత అధీర్​ రంజన్ చౌదరి ఆరోపించారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరును తప్పుపట్టారు అధీర్​. పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోవాలని కేంద్రం భావించిందన్నారు.   

19:14 January 28

ఇక్కడే ఉంటాం..

ఘాజిపూర్​ సరిహద్దులో ఉద్రిక్తత నెలకొన్న తరుణంలో రైతుల ఉద్యమం కొనసాగుతుందని బీకేయూ ప్రతినిధి రాకేశ్​ తికాయత్​ స్పష్టం చేశారు. ప్రభుత్వంతో చర్చలు జరిపేంత వరకు వెనకడుగు వేయమని తేల్చిచెప్పారు. తాగునీరు, విద్యుత్​ వంటి కనీస సౌకర్యాలను ప్రభుత్వ యంత్రాంగం తొలగించిందన్నారు. తాగునీరును తమ గ్రామాల నుంచి తెచ్చుకుంటామని వెల్లడించారు.

18:40 January 28

కలెక్టర్​ అల్టిమేటం..

దిల్లీలో సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఉద్యమంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఘాజిపూర్​ సరిహద్దును వెంటనే ఖాళీ చేయాలని ఆ జిల్లా కలెక్టర్​ రైతులకు అల్టిమేటర్​ జారీ చేశారు. ఇందుకోసం గురువారం రాత్రి వరకు సమయం ఇస్తున్నట్టు వెల్లడించారు. రైతుల వెళ్లకుంటే.. బలవంతంగా ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. 

ఈ తరుణంలో ఘాజిపుర్​ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సరిహద్దులో భారీగా బలగాలను మోహరించారు.

తాజా పరిణామాలపై తికాయత్​ స్పందించారు. సరిహద్దును ఖాళీ చేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. భాజపా నేతలు హింసకు పాల్పడేందుకు యత్నిస్తున్నారని పేర్కొన్నారు. అరెస్టు చేసినా.. కాల్పులు జరిపినా ఆందోళనలు ఆగవన్న తికాయత్​.. బలవంతంగా ఖాళీ చేయిస్తే ఉరేసుకోవడానికైనా సిద్ధమన్నారు. రైతులపై దాడి చేయొద్దని కన్నీటి పర్యంతమైయ్యారు.

17:51 January 28

  • ఘాజిపూర్ సరిహద్దును ఖాళీ చేయాలని రైతులకు కలెక్టర్ ఆదేశం
  • ఈ రోజు రాత్రి వరకు సరిహద్దు నుంచి వెళ్లాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్​
  • ఖాళీ చేయకపోతే బలవంతంగా చేయించాల్సి ఉంటుందన్న కలెక్టర్​
  • ఘాజిపూర్ వద్ద భారీగా మోహరించిన పోలీసు బలగాలు

15:29 January 28

పోలీసులు ఏం చేస్తున్నారు?

ట్రాక్టర్​ ర్యాలీ హింస నేపథ్యంలో ఎర్రకోటపై ఓ మతానికి చెందిన జెండాను ఎగరవేసిన వ్యవహారం మీద పోలీసులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బీకేయూ ప్రతినిధి రాకేశ్​ తికాయత్​. ఎవరో వెళ్లి జెండా ఎగురవేస్తున్న సమయంలో పోలీసులు ఎక్కడున్నారని ప్రశ్నించారు. కాల్పులు ఎందుకు జరపలేదని అడిగారు. అసలు అతను అక్కడికి ఎలా వెళ్లాడని.. పోలీసులు అతడిని పట్టుకోకుండా ఎందుకు వదిలేశారని ప్రశ్నలు సంధించారు. దీప్​ సిధుపై పరోక్ష ఆరోపణలు చేస్తూ.. మొత్తం సంస్థ, సంఘానికి చెడ్డపేరు తెచ్చింది ఎవరని అడిగారు.

14:54 January 28

'విద్యుత్​ కట్​ చేస్తే.. తీవ్ర పరిణామాలు..'

పోలీసులకు భారతీయ కిసాన్​ యూనియన్​(బీకేయూ) ప్రతినిధి రాకేశ్​ తికాయత్​.. పోలీసులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఘాజిపుర్​ సరిహద్దులో విద్యుత్​ సరఫరా నిలిపివేస్తే.. తీవ్ర పరిణామాలు ఎదురవుతాయన్నారు. రైతులందరు కలిసి స్థానిక పోలీసు స్టేషన్​కు వెళతారని పేర్కొన్నారు. ఆ తర్వాత ఏం జరిగినా.. దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.

మరోవైపు ట్రాక్టర్​ ర్యాలీ హింసాకాండపైనా స్పందించారు తికాయత్​. రైతు సంఘాల మధ్య చిచ్చు పెట్టి, దేశం నుంచి పంజాబ్​ను విడదీసేందుకు కొందరు కుట్ర పన్నినట్టు ఆరోపించారు. అందుకే శాంతియుత ర్యాలీలో హింస చెలరేగిందన్నారు.

14:38 January 28

సింఘు సరిహద్దు వద్ద ఉద్రిక్తత

సింఘు సరిహద్దు వద్ద మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైతులను రోడ్డుకు ఓవైపే పరిమితం చేసేలా బారికేడ్లు ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తుండగా... ఆందోళనకారులు అడ్డుకుంటున్నారు. ముందుజాగ్రత్తగా ఆ ప్రాంతంలో భారీగా భద్రతా బలగాలను మోహరించారు.

13:45 January 28

సింఘు సరిహద్దును ఖాళీ చేయాలని డిమాండ్​ చేస్తూ కొంతమంది స్థానికులు ప్లకార్డులతో నిరసన చేపట్టారు. కొన్ని రోజులుగా ఈ సరిహద్దులో రైతులు సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నారు.

13:03 January 28

భారత కిసాన్​ యూనియన్​ ప్రతినిధి రాకేశ్​ తికాయత్​కు దిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ట్రాక్టర్​ ర్యాలీ రూట్​మ్యాప్​ విషయంలో పోలీసులతో కుదిరిన ఒప్పందాన్ని ఉల్లఘించినందుకు తమపై న్యాయపరమైన చర్యలను ఎందుకు తీసుకోకూడదో తెలిపాలని నోటీసులో పేర్కొన్నారు.

12:56 January 28

20 మందికి నోటీసులు..

దిల్లీలో జరిగిన హింసాకాండపై పోలీసుల దర్యాప్తు వేగవంతం

ట్రాక్టర్ల ర్యాలీ ఘటనలపై దిల్లీ పోలీసుల ఆరా

ఎఫ్‌ఐఆర్ నమోదైన వ్యక్తుల కోసం లుకౌట్ నోటీసులు

ప్రస్తుతం 20 మంది రైతు నాయకులపై లుకౌట్ నోటీసులు

మరో 20 మంది రైతు నేతలపై లుకౌట్ నోటీసులు ఇచ్చే అవకాశం

లుకౌట్ నోటీసులపై ఐబీకి సమాచారం ఇచ్చిన దిల్లీ పోలీసులు

దేశద్రోహం కేసు నమోదు చేసిన పోలీసులు

దర్యాప్తు సంస్థలు, విమానాశ్రయాలకు లుకౌట్ నోటీసుల సమాచారం

12:38 January 28

పోలీసులకు షా పరామర్శ..

జనవరి 26న తలెత్తిన హింసాత్మక ఘటనల్లో గాయపడి ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న పోలీసులను కేంద్ర హోంమంత్రి అమిత్ షా పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి వాకబు చేశారు. ఆ ఘటనల్లో సుమారు 400 మంది పోలీసులు గాయపడినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. రైతు సంఘాలకు చెందిన కొంతమంది నేతల రెచ్చగొట్టే ప్రసంగాల వలనే హింసాత్మక ఘటనలు జరిగినట్లు పోలీసులు తెలిపారు.

11:35 January 28

గణతంత్ర దినోత్సవం రోజు హింసకు పాల్పడేందుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం శాఖ ఆదేశించింది. ఈ మేరకు దిల్లీ పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఎర్రకోట ఘటన, పోలీసులపై దాడి చేసి గాయపరచడం, హింసకు పాల్పడిన ప్రతి ఒక్కరినీ గుర్తించి దిల్లీ పోలీసులు చర్యలు తీసుకోనున్నారు. ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన వ్యక్తుల కోసం లుకౌట్ నోటీసు జారీ చేయనున్నారు పోలీసులు. నిందితులకు సంబంధించిన పాస్‌పోర్ట్‌ స్వాధీనం చేసుకునేలా చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది.

11:30 January 28

జనవరి 26న ఎర్రకోట సమీపంలో నిరసనకారులు ధ్వంసం చేసిన ఓ బస్సు వీడియోను పోలీసులు విడుదల చేశారు. 

11:07 January 28

టిక్రీ సరిహద్దులో రైతులు తమ నిరసనను కొనసాగిస్తున్నారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు అర్ధనగ్న ప్రదర్శన చేస్తున్నారు.

10:26 January 28

రైతుల ట్రాక్టర్​ ర్యాలీలో గాయపడ్డ పోలీసులను కేంద్ర హోంమంత్రి నేడు పరామర్శించనున్నారు. వారిని చూసేందుకు దిల్లీలోని రెండు ఆసుపత్రులకు షా రానున్నట్లు అధికారులు తెలిపారు.

10:13 January 28

భారీ భద్రతా వలయంలో దిల్లీ

సాగు చట్టాలకు వ్యతిరేకంగా జనవరి 26న రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారడం వల్ల దిల్లీ నగరంలో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. కేంద్ర హోంశాఖ.. అదనపు బలగాలను టిక్రీ, సింఘు సరిహద్దుల్లో మోహరించింది. రైతులు ఇప్పటికీ సరిహద్దుల్లో తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు.

Last Updated : Jan 28, 2021, 9:28 PM IST

ABOUT THE AUTHOR

...view details