ఇటీవల కాలంలో ఉగ్రమూకలు.. డ్రోన్లతో విరుచుకుపడుతున్న ఘటనలు(Drone Attack) పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఈ తరహా దాడులను ఎదుర్కొనేందుకు భద్రతా బలగాలు(indian security forces) కీలక చర్యలు చేపట్టాయి. డ్రోన్లను నేల మట్టం చేయడానికి.. ప్రాణాంతకం కాని ఆయుధాలైన పంప్ యాక్షన్ గన్(పీఏజీ)లను వినియోగించేందుకు సిద్ధమయ్యాయి. డ్రోన్ దాడులను(Drone Attack) ఎదుర్కోవడానికి పటిష్ఠమైన సాంకేతికత అందుబాటులోకి వచ్చే వరకు ఈ పీఏజీలను వినియోగించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
తక్కువ ఎత్తులో తిరిగే వాటికోసం..
సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్)లో.. డ్రోన్ దాడులను(Drone Attack) ఎదుర్కోవడానికి లైట్ మెషీన్ గన్(ఎల్ఎమ్జీ)ని సిబ్బంది వినియోగిస్తున్నారు. దీని ద్వారా.. 360 డిగ్రీల్లో పహారా కాస్తూ, అధిక ఎత్తులో తిరిగే మానవ రహిత వైమానిక వాహనాలను నేలకూల్చవచ్చు. అయితే.. తాజాగా కేంద్ర భద్రతా దళాలు రూపొందించిన ఓ బ్లూ ప్రింట్ ప్రకారం.. తక్కువ ఎత్తులో తిరిగే డ్రోన్లను నేలకూల్చేందుకు పీఏజీలను వినియోగించాల్సిందిగా భద్రతా సిబ్బందిని ఆదేశించినట్లు తెలిసింది. ఈ ఆదేశాల ప్రకారం వివిధ ఘర్షణాత్మక ప్రాంతాల్లో ఇప్పటికే.. పీఏజీలను తరలించినట్లు తెలుస్తోంది.
"డ్రోన్ల దాడిని ఎదుర్కొనేందుకు సమర్థమైన సాంకేతికత తయారు చేసేవరకు.. భద్రతా సిబ్బందిని వారి వద్ద ఉన్న పీఏజీలను వినియోగించాలని ఆదేశించాం. ఈ తరహా ఆయుధాలు ఎక్కువ సంఖ్యలో లేకపోతే వాటిని సమకూర్చుకోవాలని చెప్పాం" అని కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఓ అధికారి పేర్కొన్నారు. కశ్మీర్లో ఉగ్రవాద వ్యతిరేక విధులు నిర్వహిస్తున్నవారికి, విమానాశ్రయాల్లో పహారా కాస్తున్న సిబ్బందికి ఈ పీఏజీలను వినియోగించాలని చెప్పామని తెలిపారు.