తెలంగాణ

telangana

Security Fails at Tirumala: తిరుమలలో మరోసారి భద్రతాలోపం.. సోషల్​ మీడియాలో ఆనంద నిలయం దృశ్యాలు

By

Published : May 8, 2023, 1:05 PM IST

Security Fails at Tirumala Temple: నిత్యం భక్తులతో కిటకిటలాడుతుండే తిరుమల వేంకటేశ్వరుని ఆలయంలోని భద్రతలో డొల్లతనం మరోసారి బయటపడింది. కట్టుదిట్టమైన భద్రతను దాటుకొని మరీ ఓ భక్తుడు సెల్​ఫోన్​తో ఆలయంలోకి వెళ్లి ఆనంద నిలయాన్ని చిత్రీకరించి.. దానిని సోషల్​ మీడియాలో పోస్టు చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

Security Fails at Tirumala
Security Fails at Tirumala

Security Fails at Tirumala Temple: తిరుమల శ్రీవారి ఆలయం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిత్యం భక్తులతో రద్దీగా ఉంటుంది. ఇతర రాష్ట్రాల నుంచి స్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. అలాంటి దేవాలయంలోని భద్రతలో మరోసారి లోపం బయటపడింది. మూడు అంచెల పటిష్ట భద్రతను దాటి మరీ ఓ భక్తుడు సెల్​ ఫోన్‌తో శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించాడు. మొబైల్ ఫోన్‌తో వెళ్లిన సదరు భక్తుడు ఆలయం లోపల హల్‌చల్ చేశాడు. ఆలయం లోపల నలువైపుల నుంచి ఆనంద నిలయాన్ని ఫోన్‌లో చిత్రీకరించాడు. ఆపై ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆనంద నిలయం విజువల్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతున్నాయి. ఆనంద నిలయాన్ని అతి సమీపంలో నుంచి భక్తుడు వీడియో తీసినట్లు సమాచారం.

అయితే భక్తుడు కేవలం ఆనంద నిలయాన్ని చిత్రీకరించారా లేకుంటే ఇంకేమైనా చిత్రికరించాడా అన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే ఆ భక్తుడు ఎప్పుడు ఆలయం లోపలికి ప్రవేశించాడో తెలియాల్సి ఉంది. కాగా.. భక్తులను తనిఖీ చేసే విషయంలో నిఘా సిబ్బంది వైఫల్యం నిత్యం బయటపడుతూనే ఉంది. భక్తుడు ఆలయంలో మొబైల్ ఫోన్‌తో హల్​చల్ చేసినా సీసీ కెమెరాల సిబ్బంది గుర్తించని పరిస్థితి నెలకొంది.. ఎంత అప్రమత్తంగా ఉన్నారో తెలుస్తుందని పలువురు భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

సహజంగా శ్రీవారి ఆలయంలో భద్రత కట్టుదిట్టంగా ఉంటుంది. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలతో భద్రతను సిబ్బంది నిత్యం పర్యవేక్షిస్తూనే ఉంటారు. ఆలయానికి వచ్చే భక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే లోనికి అనుమతిస్తుంటారు. సెల్‌ఫోన్, కెమెరా, ఇంకా చిత్రీకరించడానికి వీలుగా ఉండే వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు. అయితే ఇంత పకడ్బందీగా భద్రత ఉన్నప్పటికీ ఓ భక్తుడు ఈ విధంగా శ్రీవారి ఆలయంలోకి సెల్‌ఫోన్‌ను తీసుకెళ్లడమే కాకుండా.. ఆనంద నిలయాన్ని వీడియోలు తీయడం, ఆపై సోషల్​ మీడియాలో పోస్టు చేయడంతో భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారి ఆలయంలో భద్రత ఇదేనా అంటూ భక్తులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్‌ అధికారి బాలిరెడ్డి స్పందించారు. సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలిస్తున్నామని తెలిపారు.

ఇప్పటికైనా భద్రతా విషయంలో అప్రమత్తంగా ఉండాలి: తిరుమల ఆనంద నిలయాన్ని సెల్‌ఫోన్‌లో చిత్రీకరించడాన్ని భారతీయ జనతా పార్టీ నేత భాను ప్రకాశ్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనతో తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్‌ అధికారుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఇప్పటికైనా భద్రత విషయంలో ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయో టీటీడీ సరిచూసుకోవాలని సూచించారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలన్నారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దేవాలయాల భద్రత విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని భానుప్రకాశ్‌రెడ్డి కోరారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details