తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సింగర్ హత్యతో దిగొచ్చిన పంజాబ్​ సర్కార్.. వారికి భద్రత పునరుద్ధరణ! - పంజబ్​ సర్కార్​యూచర్న్​

Punjab News: ప్రముఖ గాయకుడు, కాంగ్రెస్‌ నేత సిద్ధూ మూసేవాలా హత్యతో చర్చనీయాంశంగా మారిన వీఐపీల భద్రత విషయంలో పంజాబ్‌ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. జూన్‌ 7 నుంచి మొత్తం 424 మంది వీఐపీలకు పోలీసు భద్రతను పునరుద్ధరించనున్నట్లు వెల్లడించింది. పంజాబ్‌, హరియాణా హైకోర్టుకు గురువారం ఈ విషయాన్ని తెలియజేసింది.

Punjab News
Punjab News

By

Published : Jun 3, 2022, 8:27 AM IST

VVIP Security Restore Punjab: పంజాబ్​లో ఇటీవల తాత్కాలికంగా భద్రతను కుదించిన 424 మంది ప్రముఖులకు జూన్ 7వ తేదీ నుంచి మళ్లీ పూర్తిస్థాయి భద్రత కల్పించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం పంజాబ్, హరియాణా హైకోర్టుకు గురువారం తెలిపింది. గత వారం ప్రభుత్వం తీసుకొన్న భద్రత కుదింపు నిర్ణయం తర్వాతే.. ఆదివారం ప్రముఖ గాయకుడు సిద్ధు మూసేవాలాను దుండగులు అత్యంత దారుణంగా కాల్చి చంపారు. ఈ నేపథ్యంలో మాజీ ఉప ముఖ్యమంత్రి ఒ.పి.సోని తన భద్రత కుదింపుపై హైకోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. ప్రభుత్వ ఆదేశాలను కొట్టివేయాలని అందులో కోరారు. తదుపరి విచారణ జులై 22న ఉంటుందని సోని తరఫు న్యాయవాది మధు దయాళ్ తెలిపారు.

శాంతిభద్రతల కారణాలు చూపుతూ ఇటీవలే సిద్ధూ మూసేవాలా సహా 424 ప్రముఖుల భద్రతను ఉపసంహరిస్తున్నట్లు పంజాబ్​ ప్రభుత్వం ప్రకటించింది. వారిలో మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత, మాజీ పోలీసు అధికారులు, రాజకీయ నేతలు ఉన్నారు. ఆ మరుసటి రోజే మే 29న సాయంత్రం మాన్సా జిల్లాలో సిద్ధూ హత్యకు గురయ్యారు. భద్రత కుదింపుతోనే ఈ ఘటన జరిగిందంటూ.. భగవంత్‌ మాన్‌ సర్కారుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా నశించాయని, మాన్‌ ప్రభుత్వం అధికారంలో కొనసాగే నైతిక హక్కు కోల్పోయిందని పలువురు మండిపడ్డారు. మరోవైపు, సిద్ధూ మూసేవాలా మృతదేహంపై 19 తూటా గాయాల గుర్తులు ఉన్నట్లు పోస్టుమార్టం నివేదిక పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details