తెలంగాణ

telangana

లోక్​సభలో భద్రతా వైఫల్యం- గ్యాలరీ నుంచి సభ ఛాంబర్​లోకి దూకిన ఇద్దరు వ్యక్తులు- సభ వాయిదా

By PTI

Published : Dec 13, 2023, 1:14 PM IST

Updated : Dec 13, 2023, 2:28 PM IST

Security Breach In Loksabha
Security Breach In Loksabha

13:10 December 13

లోక్​సభలో భద్రతా వైఫల్యం- గ్యాలరీ నుంచి సభ ఛాంబర్​లోకి దూకిన ఇద్దరు వ్యక్తులు- సభ వాయిదా

లోక్‌సభ శీతాకాల సమావేశాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఈ మధ్యాహ్నం ఇద్దరు ఆగంతుకులు సందర్శకుల గ్యాలరీ నుంచి సభలోకి దూకడం తీవ్ర కలకలం రేపింది. మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో గ్యాలరీ నుంచి ఇద్దరు వ్యక్తులు సభలోకి దూకారు. ఇద్దరు ఆగంతకులు కిందకు దూకగానే గ్యాస్ విడుదల చేసే వస్తువులను సభలోకి విసిరారు. సభాపతి స్థానంలో ఉన్న బీజేపీ ఎంపీ రాజేంద్ర అగర్వాల్​ ఈ పరిణామంతో అప్రమత్తమై వెంటనే సభను వాయిదావేశారు. ఆగంతకుల చర్యతో సభలోని ఎంపీలంతా భయభ్రాంతులకు గురయ్యారు. ఒక్కసారిగా సభ నుంచి బయటకు పరుగులు తీశారు. మరోవైపు, పార్లమెంట్ బయట ఇద్దరు వ్యక్తులు స్మోక్ డబ్బాలతో నిరసనకు దిగారు. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో భద్రతా వైఫల్యంపై ఆందోళన వ్యక్తం చేశారు ఎంపీలు.

జీరో అవర్‌లో జరిగిన ఈ ఘటనలో గ్యాస్​ విడుదల చేసే వస్తువులను దుండగులు తాము ధరించిన బూట్ల నుంచి తీసినట్లు తెలుస్తోంది. ఇద్దరు ఆగంతకులు విసిరిన వస్తువుల నుంచి విడుదలైన పొగతో సభలో కలకలం రేగింది. కొంతమేర పొగ అలుముకుంది. కొందరు ఎంపీలు తెగువ ప్రదర్శించి గ్యాలరీ నుంచి దూకిన వ్యక్తులను చుట్టుముట్టారు. ఈలోపు అక్కడకు చేరుకున్న భద్రతా సిబ్బందికి ఆగంతకులను అప్పగించారు. బయటకు వచ్చిన ఎంపీలు- ఇద్దరు వ్యక్తులు సందర్శకుల గ్యాలరీ నుంచి సభలోకి దూకినట్టు చెప్పారు. లోక్‌సభ సందర్శకుల గ్యాలరీ నుంచి దూకిన వ్యక్తులు ఎవరు వారు సభలోకి ఎవరి అనుమతితో ప్రవేశించారనే అంశంపై భద్రతా సిబ్బంది దర్యాప్తు చేపట్టారు. దిల్లీ పోలీసు విభాగానికి చెందిన తీవ్రవాద వ్యతిరేక ప్రత్యేక సెల్ బృందం పార్లమెంట్​ వద్దకు చేరుకుంది.

"కచ్చితంగా ఎక్కడో లోపం ఉంది. ముందు ఒక వ్యక్తిని చూసి అతడు పడిపోయాడేమో అనుకున్నాం. కానీ రెండో వ్యక్తి కూడా వచ్చేసరికి మేం జాగ్రత్తపడ్డాం. ఆ వ్యక్తి తన షూ తీసేసి ఏదో బయటకు తీశాడు. మేమంతా అప్రమత్తమయ్యాం. దీనిపై చర్యలు తీసుకుంటాం. స్పీకర్ సహా సంబంధం ఉన్న వ్యక్తులు దీనిపై నిర్ణయం తీసుకుంటారు. రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్ సైతం సభకు వచ్చారు."
-రాజేంద్ర అగర్వాల్, బీజేపీ ఎంపీ

మరోవైపు, పసుపురంగు పొగలు చిమ్మే డబ్బాలతో పార్లమెంటు బయట నిరసన తెలుపుతున్న మరో ఇద్దరిని కూడా దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఓ మహిళను నీలమ్(42)గా, మరో వ్యక్తిని శిందే(25)గా గుర్తించారు. ట్రాన్స్​పోర్ట్ భవన్ ఎదుట వారిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. వారిని పార్లమెంట్ కాంప్లెక్స్ పోలీస్ స్టేషన్​కు తరలించారు.

దిల్లీ పోలీసులకు స్పీకర్ ఆదేశం!
ఘటనపై విచారణ కోసం దిల్లీ పోలీసులకు ఆదేశాలు జారీ చేశామని లోక్​సభ స్పీకర్ ఓంబిర్లా తెలిపారు. సభలో దుండగులు స్ప్రే చేసింది పొగ మాత్రమేనని ప్రాథమిక విచారణలో తేలిందని చెప్పారు. దాని గురించి భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. తిరిగి సమావేశం అయిన తర్వాత సభలో ఆయన మాట్లాడారు. "పార్లమెంట్ లోపల ఇద్దరు ఆగంతులను, బయట ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారికి సంబంధించిన వస్తువులన్నీ సీజ్ చేశారు. ఘటనపై ఎంపీల ఆందోళనలన్నీ వింటాం. ఎన్ని ఆటంకాలు ఎదురైనా సభ కార్యకలాపాలు జరిగేలా చూడటం మన ఉమ్మడి బాధ్యత" అని స్పీకర్ పేర్కొన్నారు.

2001లో ఇదే రోజున పార్లమెంట్​పై ఉగ్రదాడి జరగడం గగమనార్హం. లష్కరే తొయిబా, జైషే మహ్మద్ సంస్థలకు చెందిన ఉగ్రవాదులు పార్లమెంట్ కాంప్లెక్స్​పై దాడి చేశారు. ఆ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు.

Last Updated : Dec 13, 2023, 2:28 PM IST

ABOUT THE AUTHOR

...view details