Security breach at Tirumala Temple: తిరుమలలో భద్రతా లోపాలు మరోసారి బయటపడ్డాయి. ఓ భక్తుడు సెల్‌ఫోన్‌తో ఆలయ ఆవరణలోకి ప్రవేశించడం కలకలం రేపుతోంది. శ్రీవారి ఆనంద నిలయం దృశ్యాలను ఆ భక్తులు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. వీటిని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో భద్రతా లోపాలు వెలుగులోకి వచ్చాయి. సెల్‌ఫోన్‌లో ఆనంద నిలయం దృశ్యాలు తీసిన భక్తుడి వివరాల కోసం సీసీ టీవీ దృశ్యాలను తిరుమల విజిలెన్స్ అధికారులు..పరిశీలిస్తున్నారు. ఫోన్‌లో తీసిన ఆనంద నిలయం దృశ్యాలు 'ఈటీవీ భారత్' వద్ద ఉన్నప్పటికీ శ్రీవారి భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని వాటిని ప్రసారం చేయడం లేదు.
తిరుమల శ్రీవారి ఆలయంలో మరోమారు భద్రతా వైఫల్యం వెలుగుచూసింది. ఓ భక్తుడు సెల్ ఫోన్‌తో ఆలయ ఆవరణలోకి ప్రవేశించి... ఆనంద నిలయం దృశ్యాల్ని చిత్రీకరించడం చర్చనీయాంశమైంది. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో టీటీడీ అధికారులపై భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పటిష్టమైన భద్రత వ్యవస్థ ఉన్నా సెల్ ఫోన్‌తో లోపలికి ప్రవేశిస్తుంటే భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.
శ్రీవారి ఆలయంలోకి సెల్ ఫోన్ తీసుకెళ్లడానికి అనుమతి లేదు. ఇతరత్రా లగేజీని కూడా అనుమతించరు. పలు దశల్లో సెక్యూరిటీ తనిఖీలు నిర్వహించాకే భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. అలాంటిది విమాన వెంకటేశ్వరుడికి భక్తులు మొక్కుతున్న దృశ్యాలతో పాటు ప్రధాన ఆలయం కూడా ఈ వీడియోలో కనిపించటం పట్ల భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన తిరుమల విజిలెన్స్ అధికారులు... వర్షం వల్ల విద్యుత్ అంతరాయం ఏర్పడినప్పుడు... ఈ ఘటన జరిగినట్లు నిర్ధరణకు వచ్చారు. ఆనంద నిలయం వీడియో చిత్రీకరించిన వ్యక్తిపై చట్టపర చర్యలు తీసుకుంటామని తెలిపారు.