కరోనా రెండో దశ వ్యాప్తి ఇంకా ముగిసిపోలేదని, మూడోదశ ప్రజల ప్రవర్తనపై ఆధారపడి ఉంటుందని దిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా వ్యాఖ్యానించారు. "కొవిడ్ రెండోదశ ఇంకా అయిపోలేదని ప్రజలు అర్థం చేసుకోవాలని సూచిస్తున్నాను. దేశంలో రోజువారీ కేసులు 40 వేల కంటే ఎక్కువ నమోదవుతున్నాయి. ప్రతిఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలి. కొవిడ్ వ్యాప్తి నివారణకు తగిన విధంగా ప్రవర్తిస్తే.. మూడోదశ రాదు" అని గులేరియా పేర్కొన్నారు.
కరోనా రెండోదశ ఏప్రిల్‌లో ప్రారంభమైందన్న గులేరియా.. రోజువారీ కేసులు నాలుగు లక్షల దాటడం వల్ల మరణాలు పెరిగాయన్నారు. దీని ప్రభావం ఆగస్టు-సెప్టెంబరులో తీవ్రంగా ఉంటుందని కొంతమంది నిపుణులు హెచ్చరించినప్పటికీ.. మే నెలలో తగ్గుముఖం పట్టిందన్నారు.