Opposition Parties Meeting In Bangalore : వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ను కలిసికట్టుగా ఎదుర్కొనే వ్యూహంపై ప్రతిపక్షాలు సోమ, మంగళవారాల్లో బెంగళూరులో చర్చించనున్నాయి. రెండు రోజుల సమావేశానికి 26 ప్రతిపక్ష పార్టీల నాయకులు హాజరయ్యే అవకాశముంది. ప్రతిపక్ష పార్టీల రెండో సమావేశానికి ఆతిథ్యం ఇస్తున్న కాంగ్రెస్.. దిల్లీలో అధికారాలపై కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌ను పార్లమెంటులో వ్యతిరేకించనున్నట్లు ప్రకటించింది. ప్రతిపక్ష కూటమి భేటీకి హాజరుకావాలంటే ఆర్డినెన్స్‌ను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించాలని ఆమ్ ఆద్మీ పార్టీ- ఆప్ షరతు పెట్టింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రకటన వెలువరించగా.. సమావేశానికి హాజరుకానున్నట్లు ఆమ్ ఆద్మీ ప్రకటించింది.
శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలో చీలిక.. బంగాల్ పంచాయతీ ఎన్నికల్లో హింసకు తృణమూల్ కాంగ్రెస్సే కారణమని కాంగ్రెస్, వామపక్షాలు ఆరోపించిన వంటి పరిణామాల తర్వాత ఈ సమావేశం జరగనుంది. బీజేపీ విధానాలపై, ముఖ్యంగా ప్రభుత్వాలను కూల్చివేసేందుకు ఆ పార్టీ చేస్తున్న ప్రయత్నాలపై దేశవ్యాప్త పోరుకు ఉమ్మడి ఆందోళన కార్యక్రమాన్ని ఈ సమావేశంలో రూపొందిస్తారని తెలుస్తోంది. విపక్ష ఐక్యతను ముందుకు తీసుకువెళ్లేందుకు చేపట్టే చర్యల్ని ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
ఉభయ శిబిరాల్లో ఏర్పాట్లు పూర్తి..
పట్నాలో జరిగిన తొలి సమావేశం కంటే మరిన్ని పార్టీలను ఆహ్వానించి బెంగళూరులో రెండో భేటీని పక్కాగా నిర్వహించేందుకు కాంగ్రెస్ నేతృత్వంలో విపక్షం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గే సహా పలువురు నాయకులు దీనిలో పాల్గొనబోతున్నారు. బెంగళూరులోని తాజ్ వెస్ట్‌ఎండ్ హోటల్లో నిర్వహించే విపక్ష నేతల సమావేశాల ఏర్పాట్లను కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్ సింగ్ సుర్జేవాలా పర్యవేక్షించారు.
Opposition Meet Participants : ఈ సమావేశాల్లో కాంగ్రెస్ అగ్రనేతలతో పాటు బంగాల్ సీఎం మమతాబెనర్జీ (తృణమూల్ కాంగ్రెస్), బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ (జేడీయూ), తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ (డీఎంకే), ఝార్ఖండ్ సీఎం హేమంత్‌సోరెన్, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (ఆప్), లాలూ ప్రసాద్ యాదవ్ (ఆర్‌జేడీ), మహారాష్ట్ర నేతలు- ఉద్ధవ్ ఠాక్రే, ఆదిత్య ఠాక్రే, సంజయ్ రౌత్‌లతో పాటు ఎండీఎంకే, కేడీఎంకే, వీసీకే, ఆర్‌ఎస్‌పీ, ఆల్ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, కేరళ కాంగ్రెస్ (జోసెఫ్), కేరళ కాంగ్రెస్ (మణి) పార్టీల నేతలు హాజరవుతారని సమాచారం.
శరద్‌పవార్ దూరం!
అయితే, ఈ ప్రతిపక్షాల సమావేశానికి ఎస్సీపీ (శరద్ వర్గం) అధినేత శరద్ పవార్ సోమవారం హాజరు కావడం లేదు. కానీ, మంగళవారం శరద్‌తో పాటు ఆయన కుమార్తె, ఎంపీ సుప్రియా సూలే హాజరు కానున్నట్లు ఎస్సీపీ అధికార ప్రతినిధి మహేశ్ భారత్ తపాసే ప్రకటించారు.