సరిహద్దుల్లో చైనా దురాక్రమణ పర్వం కొనసాగుతోంది. అరుణాచల్‌ప్రదేశ్‌లోని షి యోమి జిల్లాలో ఓ గ్రామం నిర్మించినట్లు తెలుస్తోందని ఓ జాతీయ ఛానెల్ ఉపగ్రహ ఛాయాచిత్రాలను విడుదల చేసింది. ఆ ప్రాంతంలో చైనా సుమారు 60 భవనాలు నిర్మించినట్లు ఉపగ్రహ దృశ్యాల్లో స్పష్టమవుతోంది. 2019నాటి ఉపగ్రహ దృశ్యాల్లో లేని ఆ గ్రామం(China village in arunachal).. ఏడాది తర్వాత తీసిన చిత్రాల్లో ఉన్నట్లు గుర్తించారు.
93 కిలోమీటర్ల దూరంలో..
ఇటీవల అరుణాచల్‌లో ఓ గ్రామం(China village in arunachal) నిర్మించిన చైనా.. దానికి 93 కిలోమీటర్ల దూరంలో తూర్పు వైపున ఈ కొత్త ఎన్‌క్లేవ్‌ను(China enclave in arunachal pradesh) నిర్మించినట్లు తెలుస్తోంది. వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ), అంతర్జాతీయ సరిహద్దు మధ్య ఉన్న భారత భూభాగంలో.. రెండో గ్రామం నిర్మించినట్లు భావిస్తున్నారు. అయితే కొత్తగా నిర్మించిన ఆ భవనాల్లో ఎవరైనా ఉన్నారా? లేదా? అనే విషయం స్పష్టంగా తెలియరావడం లేదు. చైనా రెండో గ్రామం నిర్మించిన ప్రాంతం తమదేనని భారత్ గతంలో పేర్కొంది. కొత్త నిర్మాణం ఎల్ఏసీకి ఉత్తరం వైపున ఉన్నట్లు భారత సైన్యం పేర్కొంది. అయితే.. కొన్ని దశాబ్దాల క్రితమే చైనా ఆ భూభాగాన్ని ఆక్రమించుకొని నిర్మాణాలు చేపడుతోందని సైనిక వర్గాలు తెలిపాయి.