metal scrap design: ఇతని పేరు దేవల్‌వర్మ. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ వాసి. మెకానికల్ ఇంజనీరింగ్‌లో పట్టా పొందిన దేవల్‌కు లోహాల వ్యర్థాలను తిరిగి ఉపయోగించుకోవాలనే ఆలోచన కలిగింది. అనుకున్నదే తడవుగా దానినే ఓ వృత్తిగా ఎంచుకున్నాడు. పరిశ్రమలు, ఆటో గ్యారేజీల నుంచి పనికిరాని విడిభాగాలను సేకరించడం మెుదలుపెట్టాడు. వాడి పడేసిన ఆ విడిభాగాలతో వివిధ రకాలైన ఆకృతులకు రూపం కల్పించాడు. చిన్నతనం నుంచే కళలపై ఆసక్తి ఉన్న దేవల్ పెయింటింగ్, డ్రాయింగ్ చేసేవాడు. దాదాపు 8 ఏళ్లుగా ఈ వృత్తిలో ఉన్న దేవల్ వర్మ... 5 ఏళ్లుగా పూర్తిస్థాయిలో వీటిపైనే దృష్టి పెట్టాడు.
సేకరించిన విడిభాగాలను అందంగా తీర్చిదిద్దడం దేవల్‌కు వెన్నతో పెట్టిన విద్య. ఇప్పటివరకు దాదాపు 6వేల కిలోలకు పైగా లోహపు వ్యర్థాలకు అందమైన రూపాన్ని అందించినట్లు దేవల్ తెలిపాడు. ఇటీవలె ఖర్‌గోన్ పురపాలక సంస్థకు... భారతదేశ చిత్రపటాన్ని.. దేవల్ రూపొందించి ఇచ్చాడు. దానికి "సోనే కీ చిడియా" అనే పేరును కూడా పెట్టాడు. "సోనే కీ చిడియా" అంటే బంగారు పక్షి అని ఇది పూర్వం భారత్ దేశానికి ఒక పేరు అని దేవల్ పేర్కొన్నాడు.
ఇనుము, ఉక్కుతోపాటు వివిధ రకాల లోహాలతో 12 అడుగుల ఎత్తైన ఏనుగును తయారు చేశాడు దేవల్. ఈ ఏనుగు బొమ్మ ఇండోర్ నగరంలోనే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దేవల్ తన సహచరుడు జిషన్‌తో కలిసి ప్రపంచ పటం, గిటారు సహా మరెన్నో ఆకృతులను తయారు చేశాడు. చైన్‌ల సహయంతో తయారు చేసిన ప్రపంచ పటం విశేషంగా ఆకట్టుకుంటోంది. దేవల్ తయారు చేసిన కళాకృతులను 5 దేశాలకు ఎగుమతి చేస్తున్నాడు. అమెరికా, UAE, ఇటలీ, సింగపూర్ దేశాల్లో దేవల్ చేతిలో తయారైన ఆకృతులు కొలువుదీరాయి. వాటితో పాటు భారత్‌లోనూ BMW, రాయల్ ఎన్‌ఫీల్డ్ లాంటి పలు పెద్ద పెద్ద కంపెనీలతోనూ ఒప్పందం కుదుర్చుకున్నట్లు దేవల్ వెల్లడించాడు. మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ వంటి కార్యక్రమాలతో పరిశ్రమలు అభివృద్ధి చెందుతున్నాయని... అవి మనదేశం కోల్పోయిన గుర్తింపును తిరిగి తీసుకువస్తాయని దేవల్ వెల్లడించాడు.