పెళ్లి ఇంట్లో విషాదం జరిగింది. వరుడికి స్వాగతం పలికేందుకు రహదారి పక్కన వేచి ఉన్న.. వధువు కుటుంబ సభ్యులపైకి ఓ వాహనం దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలతో సహా 12 ఏళ్ల చిన్నారి అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఒడిశాలో ఈ ఘటన జరిగింది. దీంతో ఆనందంగా పెళ్లి జరగాల్సిన ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..గంజాం జిల్లాలో ఈ ఘటన జరిగింది. మృతులను స్వప్న రెడ్డి(22), సంజు రెడ్డి(23), భారతి రెడ్డి(12)గా పోలీసులు గుర్తించారు. గోపాల్‌పుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాండియాపల్లి వద్ద ప్రమాదం జరిగిందని వెల్లడించారు. వీరంతా కేశవ్ నగర్‌కు చెందిన వారని తెలిపారు. ఘటనలో మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం గాయపడ్డ వారంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వివరించారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెప్పారు.