SCO Summit 2023 Goa : పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ సాక్షిగా భారత్.. దాయాదిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసింది. సీమాంతర ఉగ్రవాదాన్ని నిర్మూలించాల్సిన అవసరాన్ని ఎస్సీవో సభ్య దేశాలకు నొక్కి చెప్పింది. ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చే మాధ్యమాలను బేషరతుగా నిషేధించాలని ఎస్సీవో విదేశాంగ మంత్రుల సమక్షంలో విదేశాంగ మంత్రి జై శంకర్.. పాక్‌కు పరోక్ష సూచనలు చేశారు.
గోవా వేదికగా భారత్ నేతృత్వంలో రెండో రోజు ఎస్సీవో విదేశాంగ మంత్రుల మండలి సమావేశం జరిగింది. పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టోతో పాటు చైనా విదేశాంగ మంత్రి క్వింగ్ గాంగ్, రష్యా మంత్రి సెర్గీ లావ్రోవ్ ఇందులో పాల్గొన్నారు. వీరితో పాటు తజకిస్థాన్, కిర్జికిస్థాన్, కజకిస్థాన్ విదేశాంగ మంత్రులు పాల్గొన్నారు. ఇందులో ఆంగ్లాన్ని ఎస్సీవో మూడో అధికారిక భాషగా గుర్తించాలని సభ్య దేశాలను జైశంకర్ కోరారు. రష్యన్, మాండరిన్‌లు అధికారికంగా ఉన్న క్రమంలో ఆంగ్లాన్నీ అధికారిక భాషగా చేర్చాలన్నారు. ఎస్సీవోలో సంస్కరణలు, ఆధునీకరణపై చర్చ ప్రారంభమైందని చెప్పడానికి సంతోషిస్తున్నాని అన్నారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించాల్సిన అవసరాన్ని జైశంకర్‌నొక్కి చెప్పారు
"ఉగ్రవాద ముప్పు నిరంతరం కొనసాగుతోంది. ఉగ్రవాదానికి ఎటువంటి సమర్థన ఉండకూడదు. దానిని సమర్థించడం, సీమాంతర ఉగ్రవాదంతోపాటు అన్ని రూపాల నుంచి తీవ్రవాదాన్ని నిర్మూలించాలి. ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చే మాధ్యమాలను బేషరతుగా నిషేధించాలి. ఎస్ఈవో ఉద్దేశ్యాలలో ఉగ్రవాదం ముఖ్యమైనదని మళ్లీ గుర్తు చేస్తున్నాను. ఎస్సీవో సంస్కరణలు, ఆధునీకరణపై చర్చ ప్రారంభమైందని చెప్పడానికి సంతోషిస్తున్నాను."