దిల్లీ లూటెన్స్ (Lutyens Delhi) ప్రాంతం.. హై సెక్యూరిటీ జోన్లో ఉన్న పాకిస్థాన్ హైకమిషన్ (Pak high Commission New Delhi) వద్ద ఓ 40 ఏళ్ల వ్యక్తి, ఆయన కుమారుడు వారం రోజుల నుంచి కార్లోనే నివసిస్తున్నారు. గోపాలకృష్ణన్ అనే ఆ వ్యక్తి తనను తాను శాస్త్రవేత్తగా చెప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. ఇన్నోవా కార్‌ను అద్దెకు తీసుకొని.. చాణక్యపురిలోని నెహ్రూ పార్క్ సమీపంలో ఏడు రోజుల నుంచి ఉంటున్నారని చెప్పారు. వారిద్దరి మానసిక పరిస్థితి బాగా లేదని.. అడిగిన ప్రశ్నలకు సైతం సరిగా సమాధానాలు చెప్పలేదని పేర్కొన్నారు.
తాము ఇటీవలే అమెరికా వెళ్లామని ఇరువురూ పోలీసులకు వివరించారు. అమెరికా భద్రతా ఏజెన్సీలు తమ శరీరాల్లో మైక్రోచిప్‌లను (microchip in body) అమర్చారని చెప్పుకొచ్చారు. ఈ విషయమై.. ప్రధాని నరేంద్ర మోదీని అభ్యర్థించి భద్రత కోరేందుకు వచ్చామని, ఆయన నుంచి స్పందన రాలేదని పోలీసులతో చెప్పారు. అమెరికా-భారత్ మధ్య సంబంధాలపై ఫిర్యాదు చేసేందుకు దిల్లీ వచ్చినట్లు ఇరువురూ పేర్కొన్నారు. కార్లో కూర్చున్న సమయంలోనూ వీరిద్దరూ హెల్మెట్లు ధరించారు. హెల్మెట్ తీసేస్తే శరీరంలో నుంచి వైబ్రేషన్లు వస్తాయని చెబుతున్నారు.
"వీరిద్దరికి మానసిక సమస్యలు ఏమైనా ఉన్నాయా? అని పరీక్షిస్తాం. పాకిస్థాన్ ఎంబసీ సమీపంలోని పార్కింగ్ ప్రదేశంలో వారి కార్‌ను నిలిపి ఉంచారు. నిర్లక్ష్యంగా ఉన్న ఇక్కడి బీట్ ఆఫీసర్ నార్సిరామ్ను సస్పెండ్ చేశాం."