దేశం నలుమూలలా దాదాపు ఏడాదిపాటు మూతపడి ఉన్న పాఠశాలల్ని మొన్న ఫిబ్రవరి, మార్చ్ నెలల్లో కొన్నిచోట్ల తెరిచినా- మలిదశ కరోనా విజృంభణ భయాందోళనల మధ్య మళ్ళీ తాళాలు బిగించాల్సి వచ్చింది. ఇప్పటికీ తరతమ భేదాలతో అదే అనిశ్చితి, ఉద్విగ్నత కొనసాగుతున్నాయి. విద్యార్థులు ఇలా నెలల తరబడి ప్రత్యక్ష బోధనకు దూరంకావడం ఎన్నడూ కనీవినీ ఎరుగనిది. యూపీ, తెలంగాణ, బిహార్ వంటి రాష్ట్రాల్లో బడుల్ని త్వరగా పునరారంభించనున్నారన్న సమాచారం పెద్దయెత్తున కలకలం రేకెత్తిస్తోంది. విడతలవారీగా పాఠశాల తరగతుల్ని ప్రారంభించాలన్న విద్యాశాఖ యోచనను ఖండిస్తూ దాఖలైన అర్జీపై విచారణలో భాగంగా తెలంగాణ ఉన్నత న్యాయస్థానం సూటిగా కొన్ని ప్రశ్నలు లేవనెత్తింది! ఇంటర్ బోర్డు పరీక్షల నిర్వహణ మూలాన ఏ ఒక్కరు మరణించినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని మూన్నాళ్లక్రితం, నిన్నా సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఏపీలో పది, ఇంటర్ పరీక్షల రద్దు నిర్ణయం 'సుప్రీం' నిర్దేశ పర్యవసానమే. ఒక్కో పరీక్షా కేంద్రంలో 15-20 మందిని కూర్చోబెడతామనడాన్ని సర్వోన్నత న్యాయస్థానం గర్హించిన చందంగానే, ఇరుకిరుకు పాఠశాలల్లో విద్యార్థులు భౌతిక దూరమెలా పాటించగలరని తాజాగా తెలంగాణ హైకోర్టూ నిగ్గదీసింది.
క్షేత్రస్థాయి స్థితిగతుల్ని, భిన్నాంశాలను క్షుణ్నంగా అధ్యయనం చేయకుండా, మార్గదర్శకాలేవీ రూపొందించకుండానే తరగతుల నిర్వహణపై యోచనను బహిరంగపరచి తలంటించుకున్న విద్యాశాఖ- ఇప్పుడు తల్లిదండ్రుల అంగీకారంతోనే పిల్లల్ని అనుమతిస్తామంటోంది. మూడోదశ ప్రకోపంపై కథనాలు, కొన్ని రాష్ట్రాల్లో 'డెల్టా ప్లస్' రకం కేసులు వెలుగు చూస్తున్న దశలో ఏ అమ్మానాన్నలైనా బిడ్డల్ని బడికి ఎలా పంపిస్తారు? ఎక్కువమందికి వ్యాక్సిన్ రక్షణ లభించిన తరవాతే పాఠశాలలు తెరిచే యోచన చేయాలంటున్న 'నీతి ఆయోగ్' సైతం, ప్రస్తుతం ప్రాణాల్ని పణంపెట్టే దుస్సాహసానికి తెగించరాదన్న వాదనలకే గట్టిగా ఓటేస్తోంది!