తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మా మంచి హెడ్​మాస్టర్'.. సొంత జీతంతో సర్కారు బడికి కొత్త హంగులు - ఛత్తీస్​గఢ్ స్కూల్ హెడ్​మాస్టర్

విద్యార్థుల చదువు కోసం తన జీతాన్ని పాఠశాలపై పెట్టుబడిగా పెడుతున్నారు ఓ ప్రధానోపాధ్యాయుడు. ప్రభుత్వ స్కూల్​లలో సరైన వసతులు ఉండవన్న అభిప్రాయాన్ని మార్చేస్తున్నారు. ఒకప్పుడు ప్రైవేట్ స్కూళ్ల బాట పట్టిన స్థానిక చిన్నారులను.. ప్రభుత్వ బడిలో చేరేలా కృషి చేస్తున్నారు.

school-teacher-making-school-unique-with-his-salary-
school-teacher-making-school-unique-with-his-salary-

By

Published : Mar 19, 2023, 1:36 PM IST

'మా మంచి హెడ్​మాస్టర్'.. సొంత జీతంతో సర్కారు బడికి కొత్త హంగులు

ఆ ప్రభుత్వ బడిలో కనిపించేవన్నీ విద్యార్థుల విజ్ఞానాన్ని పెంచేవే.. గోడల మీద పెయింటింగ్​ల నుంచి.. చెట్ల చుట్టూ కట్టిన పిట్ట గోడల వరకు ప్రతీదీ చిన్నారులకు ఏదో ఒక విషయాన్ని నేర్పిస్తుంది. నిజానికి అది ప్రభుత్వ బడా.. లేదా గార్డెనా అనే అనుమానం కూడా కలుగుతుంది. అక్కడి విద్యార్థులు సైతం మంచి క్రమశిక్షణతో పాఠాలు నేర్చుకుంటారు. ప్రభుత్వ బడులు అంటేనే వసతుల లేమి అనుకునే భావనను చెరిపివేసేలా.. కార్పొరేట్ స్కూల్​కు దీటుగా దీన్ని నడుపుతున్నారు. దీనంతటికీ.. ఇక్కడ ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న కృపా శంకర్ ప్రత్యేక కృషే కారణం.

ఛత్తీస్​గఢ్​లోని అంబికాపుర్​ జిల్లాలోని చిఖ్​లాడీ ప్రాంతంలో ఈ పాఠశాల ఉంది. కృపా శంకర్ 2012 నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు. ఈ ప్రాంతంలోని విద్యార్థులు చదువు పట్ల పెద్దగా ఆసక్తి కనబర్చడం లేదని గ్రహించిన ఆయన.. ప్రత్యేకంగా ఏదైనా చేయాలని భావించారు. ముందుగా.. పిల్లలను స్కూల్​కు ఆకర్షితులయ్యేలా చేయాలనుకున్నారు. వెంటనే స్కూల్​ రూపురేఖలు మార్చే పనిలో పడ్డారు.

విద్యార్థులతో కృపా శంకర్

"2012లో నేను ఇక్కడ నియమితులయ్యా. ఇక్కడికి వచ్చిన రెండేళ్లు పరిస్థితి బాగుండేది కాదు. మొదట పిల్లలు స్కూల్​కు వచ్చేలా చేసేందుకు పాఠశాలను ఆకర్షణీయంగా తయారు చేశాం. ఇందుకోసం అయ్యే ఖర్చును నేను భరించా. స్కూల్​ కోసం ఏదైనా చేయాలన్న సంకల్పం ఉండేది. నెలకు నాకు వచ్చే జీతంలో ఒకరోజు వేతనాన్ని స్కూల్ కోసం వెచ్చిస్తున్నా."
-కృపా శంకర్, ప్రధానోపాధ్యాయుడు

కృపా శంకర్ ఒకరోజు వేతనం మూడు వేల రూపాయలు. ఏడాదికి పన్నెండు రోజుల వేతనాన్ని స్కూల్​ కోసం వెచ్చిస్తున్నారాయన. అంటే.. పాఠశాల అవసరాల కోసం తన వేతనం నుంచి 36 వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. వాటితోనే స్కూల్​లో సుందరీకరణ పనులు చేపట్టారు.

ఇక్కడి పిల్లలకు పాఠాలు బోధించే పద్ధతి సైతం వినూత్నంగానే ఉంటోంది. ప్రత్యేకమైన మెటీరియల్​ను రూపొందించుకొని విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు. చిన్న చిన్న బంతులను ఉపయోగించి లెక్కలు నేర్పిస్తున్నారు. త్రిభుజం, చతురస్రం ఆకారంలో చెట్ల చుట్టూ గోడలు కట్టి.. వాటి ఆకారాల గురించి పిల్లలకు అర్థమయ్యేలా చెబుతున్నారు. ప్రధానోపాధ్యాయుడి కృషిని గుర్తించిన గ్రామస్థులు.. తమ పిల్లలను ఈ పాఠశాలకే పంపిస్తున్నారు. గతంలో ప్రైవేటు స్కూల్​కు పంపుతున్న తమ చిన్నారులను.. ఆ బడి మాన్పించి ఇక్కడికి పంపుతున్నారు.

చెట్ల చుట్టూ సమద్విబాహు త్రిభుజం, చతురస్రం ఆకారాలు

"గతంలో ప్రైవేట్ స్కూల్​లో చదివించేవాడిని. ప్రైవేట్ స్కూల్​లో చదువు సరిగా చెప్పేవారు కాదు. ఫీజు కట్టించుకోవడమే ఉండేది. ఇక్కడికి వచ్చి చూసినప్పుడు చాలా వినూత్నంగా చదువు చెబుతున్నారని తెలిసింది. ప్రధానోపాధ్యాయుడు బాగా కృషి చేస్తున్నారు. బాగా చదివిస్తున్నారు. నా పిల్లలని ఇక్కడే చదివిస్తే బాగుంటుందని అనిపించింది. ఇప్పుడు నా బిడ్డ ఇక్కడే చదువుతున్నాడు. చాలా నేర్చుకుంటున్నాడు."
-ప్రదీప్ బడ్వా, గ్రామస్థుడు

అనేక ప్రభుత్వ స్కూల్​లను నిధుల కొరత వేధిస్తోందని కృపా శంకర్ చెబుతున్నారు. దీనికి సొంతంగా పరిష్కారం వెతుక్కోవాలని తోటి ఉపాధ్యాయులకు పిలుపునిస్తున్నారు. తమకు వచ్చిన ఆదాయంలో కొంత మేరకైనా స్కూల్ కోసం వెచ్చించేందుకు ప్రయత్నించాలని సూచిస్తున్నారు.

స్కూల్

ABOUT THE AUTHOR

...view details