School Open In 365 Days :ఈ బడి ఏడాదిలో 365 రోజులూ పనిచేస్తుంది. అది కూడా ఉదయం ఏడు నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు. ఆశ్చర్యంగా ఉందా? మహారాష్ట్ర నాసిక్ జిల్లా త్రయంబకేశ్వర్ మండలం హివాలీలో ఉందీ పాఠశాల. సెలవులే లేకుండా రోజుకు 14గంటలు పనిచేయడం దీని ప్రత్యేకత.
"మా బడి ఏడాదిలో 365 రోజులు ఉదయం 7 నుంచి రాత్రి 9 వరకు నడుస్తుంది. ఈ 14 గంటల్లో మేము వ్యవసాయం, పశువుల పెంపకం, చదవడం వంటి అనేక పనులు చేస్తాం."
--కిరణ్ అంబాదాస్ భోయే, విద్యార్థి
"పెద్ద పిల్లలు తమకన్నా చిన్నవారికి చదువు చెబుతారు. కేజీ నుంచి 6వ తరగతి వరకు విద్యార్థులు అందరినీ బృందాలుగా విభజించారు. ప్రతి విద్యార్థి ఓ బృందంలో సభ్యునిగా ఉంటారు. పెద్ద పిల్లలు ఒక్కొక్కరు ఒక్కో సబ్జెక్ట్ తీసుకుంటారు. చిన్నవారికి సైన్స్, మ్యాథ్స్, వ్యాసరచన వంటివన్నీ చక్కగా నేర్పిస్తారు."
--ప్రతీక్షా రామ్‌దాస్ భుసారే, విద్యార్థి
కుటుంబానికి అండగా సవ్యసాచి విద్యార్థులు
ఇక్కడి విద్యార్థులందరికీ పెద్దపెద్ద ఎక్కాలు వచ్చు. వీరంతా ఒకేసారి రెండు చేతులతోనూ రాయగల సవ్యసాచులు. విద్యార్థులు బడిలోనే కూరగాయలు పెంచుతారు. వాటిని మార్కెట్లో అమ్మి, వచ్చిన డబ్బులు ఇంట్లో ఇస్తారు.
"మా బడికి భవనం ఏమీ లేదు. టార్పాలిన్ షీట్ కిందే ఉంటుంది. ఒక్కోసారి మేము పొలానికి వెళ్తాం. అక్కడి నుంచి వంకాయలు, గుమ్మడికాయలు, వేరుశెనగ, టమోట, బెండకాయలు వంటివి అమ్మేందుకు మార్కెట్‌కు వెళ్తాం."
--మహేశ్వరీ మోరే, 8వ తరగతి విద్యార్థి
వారి జీవితాలు మార్చాలన్న సంకల్పం
ఈ బడి ఇంత ప్రత్యేకంగా నిలవడానికి కారణం కేశవ్ గావిత్. రాజనీతి శాస్త్రంలో ఎమ్ఏ చేసిన ఆయన ఐఏఎస్ కావాలనుకున్నారు. కానీ, పేదరికం వల్ల ఆ కల నెరవేరలేదు. అయినా కేశవ్ ఏమాత్రం నిరాశ చెందలేదు. హివాలీ గ్రామంలోని గిరిజనుల జీవితాల్ని మార్చాలని సంకల్పించుకున్నారు. టీచర్‌గా మారి అక్కడి పిల్లలకు చదువు చెబుతున్నారు.