School Girl Sets 100 World Records :రికార్డుల మీద రికార్డులు సొంతం చేసుకుంటోంది ఈ చిచ్చరపిడుగు. ఎన్నో ప్రపంచ రికార్డులు.. ఈ అమ్మాయి ప్రతిభ, నైపుణ్యాలకు దక్కిన ప్రతిఫలాలు. అంతేనా 14 ఏళ్లకే 3 డాక్టరేట్లు అందుకుని ఆశ్చర్య పరిచింది. సాధన చేస్తే.. సాధించలేనిదేదీ ఉండదంటూ యోగా, సామాజిక సేవలో తనదైన ప్రత్యేకత చాటుకుంటోందీ మల్టీ టాలెంటెడ్ కిడ్.
యోగాలో విన్యాసాలు చేస్తున్న ఈ అమ్మాయి పేరు ప్రిషా. స్వస్థలం తమిళనాడు. తండ్రి వ్యాపారవేత్త.. తల్లి లాయర్. తల్లి దేవి ప్రియ హాబీగా యోగా నేర్పించేవారు. ఆమెను చూస్తూ చిన్ననాడే యోగాపై ఆసక్తి పెంచుకుంది ప్రిషా. పాఠశాల విద్యలో రాణిస్తూనే పట్టుదలతో యోగా సాధన చేసింది. పుదుచ్చేరిలో యోగా ప్రొఫెసర్‌గా ఉన్న అమ్మమ్మ ప్రోత్సాహం కూడా తనకు ఉందని అంటోంది.
కళ్లకు గంతలతో సైకిల్ రైడింగ్
కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో కఠోర సాధన చేసింది ప్రిషా. నీటి అడుగున, నీటిపైనా చేసే యోగా, వినూత్నంగా ఈత కొట్టడం వంటి అబ్బురపరిచే విన్యాసాలు చేసింది. కళ్లకు గంతలతో సైకిల్ తొక్కడం, సైకిల్ తొక్కుతూనే హులాహుప్ చేయడం, కళ్లకు గంతలుండగానే తన ముందు ఏ వస్తువుందో ఇట్టే చెప్పేయడం చేస్తూ ఔరా అనిపించింది. స్కేటింగ్, 2 చేతులతో రాయడం, రూబిక్ క్యూబ్స్ సాల్వ్ చేయడంలో చిచ్చరపిడుగులా మారింది.
తొమ్మిదేళ్ల వయసులోనే డాక్టరేట్
ఎదగడమేకాదు తోటి వారికి చేయందించడంలోనూ ముందుంటోంది ప్రిషా. తనకు 8 ఏళ్లు ఉన్నప్పుడు అంధుల్ని చూసి చలించిపోయింది. తిరునల్వేలిలో వారికి యోగా శిక్షణ ఉచితంగా ఇవ్వడం మొదలుపెట్టింది. ఈ చిన్నారి సేవను చూసి 2019లో యూనివర్సిటీ ఆఫ్ జెరూసలేం మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్స్, వేలూరు వారు డాక్టరేట్ అందించారు. అలా తొమ్మిదేళ్ల వయసులోనే డాక్టరేట్ పొందిన అమ్మాయిగా ప్రిషా రికార్డు సాధించింది.
"ఇంత చిన్నవయసులో నేను మాత్రమే ప్రపంచ యోగాలో 100కు పైగా అవార్డులు సాధించాను. ఇదేగాక కేంద్ర ప్రభుత్వం సర్టిఫికెట్ ఇవ్వడం వల్ల అంధ విద్యార్థులకు యోగాలో శిక్షణ ఇస్తున్నాను. 'యోగా ఇండ్రియా సీవమ్ ఇన్బుమ్ పెరువమ్' అనే పుస్తకాన్నీ రాశాను. నీటిపై అత్యధిక యోగాసనాలు వేసిన వారిలో నేనూ ఒకరిని. ప్రపంచంలో అతిపిన్నవయసులోనే యోగాలో 3 డాక్టరేట్లు అందుకున్నాను. 2 ఇండియా, 1 యుఎస్ నుంచి. గత 4ఏళ్లుగా అనేక స్కూళ్లు, కాలేజీలకు వెళ్లి ఉచితంగా యోగా నేర్పిస్తున్నాను. పోటీపరీక్షల కోసం చాలా మంది నా గురించి తెలుసుకున్నారు. నేను థాయ్‌లాండ్, మలేసియాల్లో జరిగిన ప్రపంచ యోగా పోటీల్లో భారత్ తరపున ఛాంపియన్‌గా నిలిచాను."
--ప్రిషా, యోగా సాధకురాలు