School bus fire: విద్యార్థులతో వెళ్తున్న ఓ పాఠశాల బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సులోని 16 మంది విద్యార్థులు, డ్రైవర్, క్లీనర్ త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని నవీ ముంబయిలో సోమవారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో జరిగింది.
ఐరోలీ ప్రాంతంలోని ఓ పాఠశాలకు చెందిన బస్సు 16 మంది విద్యార్థులతో వెళ్తుండగా ఠాణె వెస్ట్‌లోని సిగ్నల్ స్కూల్ సమీపంలో ముంబయి- నాశిక్ రోడ్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు ప్రాంతీయ విపత్తు నిర్వహణ విభాగం చీఫ్ అవినాశ్ సావంత్ తెలిపారు. మంటలను గమనించిన డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి విద్యార్థులను బస్సులోంచి దింపేయటం వల్ల ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని పేర్కొన్నారు. స్థానిక అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేసినట్లు చెప్పారు.
లోయలోపడి బాలుడు మృతి: తేనెటీగల గుంపు నుంచి తప్పించుకునే క్రమంలో కాలుజారి లోయలో పడిపోయిన ఓ బాలుడు అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. ఈ సంఘటన మహారాష్ట్ర, సతారా తాలుకాలోని శివాజీనగర్‌లో జరిగింది. తేనెటీగల దాడిలో మరో 8 మంది తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలయ్యారు.