విద్యను అందరికీ అందించాలనే గొప్ప లక్ష్యంతో గుజరాత్‌కు చెందిన ఓ సంస్థ అద్భుతమైన ఆలోచన చేసింది. బస్సునే తరగతి గదిగా అధునిక వసతులతో మొబైల్ స్కూల్‌గా మార్చేసి పిల్లలకు విద్యనందిస్తుంది. సూరత్‌కు చెందిన విద్యాకుంజ్-విద్యాపీఠ్ గ్రూప్.. విద్యకు దూరంగా ఉంటూ ఎక్కడో మురికివాడలు, ఫుట్‌పాత్‌లలో నివసించే పేద పిల్లలకు విద్యనందించే సంకల్పంతో బ్రహ్మాండమైన వసతులతో మొబైల్ స్కూల్‌ను ఏర్పాటు చేసింది. బస్సులోనే బెంచీలు, టీవీ, ఇంటర్నెట్, ఫ్యాన్, లైట్లు వంటి అత్యాధునిక వసతులు కల్పించింది. అంతేకాకుండా బస్సును తరగతి గదిలా తీర్చిదిద్ది విద్యార్థులకు రోజూ పాఠాలు బోధిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. పిల్లలు ఉండే చోటకు రోజూ ఆ సంస్థ ప్రతినిధులు వెళ్తూ వారిని తీసుకొచ్చి జాగ్రత్తగా బస్సులోకి ఎక్కించి వినోదాత్మకంగా పాఠాలు బోధిస్తున్నారు.
ప్రస్తుతం ఈ బస్సులో 32మంది పిల్లలు ఉన్నారని.. ఈ సంఖ్య పెరిగితే మాత్రం మూడు గంటలు చొప్పున రెండు బ్యాచ్‌లుగా తరగతులు నిర్వహిస్తామని నిర్వహకులు తెలిపారు. తమకు సాధ్యమయ్యేంతవరకు మొబైల్ స్కూల్ ద్వారా ప్రతి సౌకర్యాన్నీ అందించేందుకు తాము ప్రయత్నిస్తామని చెప్పారు. విద్య అనేది అందరీ హక్కు అని.. ఆ ఫుట్‌పాత్‌లపై నివసించేవారితో సహా పిల్లలందరికీ విద్యను అందంచిడంమే తమ అశయమని తెలిపారు. చదువుతోనే పిల్లల భవిష్యత్తు మెరుగుపడుతుందన్నారు. ప్రస్తుతం సూరత్ నగరంలోని అడజాన్, రాండర్ ప్రాంతాల్లోని ఫుట్‌పాత్‌లపై నివసించే పేద పిల్లలకు ఈ బస్సులో విద్యనందిస్తున్నారు.