హైకోర్టుల జడ్జిలుగా సుప్రీంకోర్టులోని న్యాయవాదులను నియమించే అంశాన్ని పరిగణించాలని సుప్రీం బార్ అసోసియేషన్(ఎస్సీబీఏ) అధ్యక్షుడు వికాశ్ సింగ్.. భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణకు లేఖ రాశారు. సర్వోన్నత న్యాయస్థానంలో పనిచేస్తున్న న్యాయవాదులకు అపార అనుభవం, వివిధ పరిస్థితులను ఎదుర్కోగలిగే సామర్థ్యం ఉందన్నారు.
"సుప్రీంలోని న్యాయవాదులకు చాలా అనుభవం ఉంది. కానీ హైకోర్టు న్యాయమూర్తుల నియామకం కోసం వారిని పరిగణించరు. హైకోర్టుల్లో ప్రాక్టీసు చేయకపోవడం ఇందుకు కారణం. ఎంత అనుభవం, జ్ఞానం ఉన్నా వారికి అవకాశం దక్కడం లేదు. ఈ ప్రక్రియ పారదర్శకంగా ఉండాలి. సరైన న్యాయవాదులను ఎస్సీబీఏ ఎంపిక చేసి, సీజేఐకి పంపితే.. భారత ప్రధాన న్యాయమూర్తి ఆ జాబితాను వివిధ హైకోర్టు కోలీజియాలకు పంపే విధంగా వ్యవస్థ ఉండాలన్నది నా అభిమతం."
--- వికాశ్ సింగ్, ఎస్సీబీఏ అధ్యక్షుడు.