రామ మందిర నిర్మాణ బాధ్యతలు చూస్తున్న రామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్‌పై విపక్షాలు అవినీతి ఆరోపణలు చేశాయి. భూమి కొనుగోలు వ్యవహారంలో ట్రస్ట్ సభ్యులు అవినీతికి పాల్పడ్డారని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్, సమాజ్ వాదీ పార్టీ నేత పవన్ పాండే ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం వేర్వేరుగా విలేకరుల సమావేశాల్లో పాల్గొని ఈ ఆరోపణలు చేశారు.
రెండు కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ రూ.18.5 కోట్లు పెట్టి కొనుగోలు చేసిందని సంజయ్ సింగ్ ఆరోపించారు. కుసుమ్, హరీశ్ పాఠక్ అనే వ్యక్తుల నుంచి రవి మోహన్, సుల్తాన్ అన్సారీ ఆ భూమిని రూ.2 కోట్లకు కొనుగోలు చేశారని, అది జరిగిన ఐదు నిమిషాలకే వారి నుంచి ట్రస్ట్ కొనుగోలు చేసిందని వివరించారు. ఇందుకోసం రూ.₹16.5 కోట్లు అదనంగా చెల్లించినట్లు ఆరోపించారు. రెండు లావాదేవీలకు ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా, అయోధ్య మేయర్ రిషికేశ్ ఉపాధ్యాయ సాక్షులుగా వ్యవహరించారని పేర్కొన్నారు.